12 ఎకరాల్లో కడప నగరంలో ఏర్పాటైన పచ్చటి క్రికెట్ మైదానం ఇక కేవలం చిన్న చిన్న మ్యాచ్‌లకే పరిమితమా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.. కడప కంటే వెనుక ఏర్పాటైన మైదానాలకు సైతం రంజీ మ్యాచ్‌లు కేటాయిస్తుంటే అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగి ఉండటంతో పాటు గతంలో మూడు రంజీ మ్యాచ్‌లు నిర్వహించిన అనుభవం ఉన్న కడపకు ఈ సీజన్‌లో ఎటువంటి స్టేట్‌మ్యాచ్‌లు ఇవ్వకపోవడంతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రంజీ మ్యాచ్ కూడా కేటాయించకపోవడం చూస్తుంటే కడప మైదానం పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ఉన్న అభిమానం ఏపాటిదో ఇట్టే అర్థమైపోతోంది.
జిల్లా క్రికెట్ సంఘం పాత్ర పరిమితమేనా..!
జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా దాదాపు 25 సంవత్సరాలుపైగా ఎం. వెంకటశివారెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌లో సైతం గట్టి పట్టు ఉండటంతో రెండుసార్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవిలో సైతం కొనసాగుతున్నారు. ఈయనతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిన డి. నాగేశ్వరరాజు సౌత్‌జోన్ కార్యదర్శిగా, సౌత్‌జోన్ కార్యదర్శిగా పనిచేసిన ఉమామహేశ్వర్‌రావుకు ఏసీఏ ఎస్టేట్ మేనేజర్‌గా ఏసీఏలో కీలకమైన సభ్యులుగా ఉన్నారు. వీరు తలచుకుంటే ఏసీఏలో చక్రం తిప్పి జిల్లాకు రంజీలు వచ్చేలా చేయగల శక్తి ఉన్నవారే. అయినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మ్యాచ్‌లు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది.
ఏపీఎల్‌పైనా నీలి నీడలు..?
ఈ ఏడాది డిసెంబర్–జనవరి మధ్య కాలంలో కడప నగరంతో పాటు మరో మూడు మైదానాల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించేలా ఏసీఏ నిర్ణయించింది. పోటీల్లో పాల్గొనేందుకు 6 క్రీడాజట్లను సైతం వివిధ పేర్లతో ఖరారు చేసింది. దీంతో రంజీలు రాకపోయినా మంచి మ్యాచ్‌లు చూసే అవకాశం లభించిందనుకున్న జిల్లా క్రీడాకారుల ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి.
కడప స్పోర్ట్స్ : నగర పరిధిలోని పుట్లంపల్లెలో 11.6 ఎకరాల్లో రూ. 8 కోట్లతో వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం ఏర్పాటైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల మూలనిధిని అందజేశారు. దీంతో 2009లో ప్రారంభమై 2011 నాటికి మైదానం అందుబాటులోకి వచ్చింది. 2011 డిసెంబర్ 6 నుంచి 9 వరకు తొలి రంజీ మ్యాచ్ ఆంధ్రా–విదర్భ జట్ల మధ్య సాగింది. 2012 డిసెంబర్ 29 నుంచి 2013 జనవరి 1వ తేదీ వరకు ఆంధ్రా–కేరళ జట్ల మధ్య రెండో రంజీ నిర్వహించారు. తర్వాత 2013 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వ తేదీ వరకు మూడో రంజీ మ్యాచ్ ఆంధ్రా–మహారాష్ట్ర జట్ల మధ్య సాగింది. అప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కడపలోని మైదానానికి రంజీ మ్యాచ్‌లను కేటాయించకపోవడం గమనార్హం.
అభిమానుల ఆశలు ఆవిరి..
పెద్దపెద్ద నగరాలకు వెళ్లి క్రికెట్ చూడలేని క్రీడాభిమానులకు కడప నగరంలో చక్కటి మైదానం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్వహించిన మూడు రంజీ మ్యాచ్‌లలో సైతం అంతర్జాతీయ క్రికెటర్లు కడప గడపలో అడుగిడిన వేళ క్రీడాకారుల ఆనందం చెప్పలేనిది. కడప నగరంలోని మైదానానికి అంతర్జాతీయ ఆటగాళ్లు సాయిరాజ్‌బహుతులే, హేమాంగ్ బదాని, అమొల్ మజుందార్, సంజు శ్యాంసన్, శివసుందర్‌దాస్, వేణుగోపాల్, శ్రీశాంత్ తదితర ఆటగాళ్లతో పాటు ప్రస్తుత భారతజట్టు ఆటగాడు కేదార్‌జాదవ్ వంటి ఆటగాళ్లను నేరుగా తిలకించే అవకాశం జిల్లా వాసులకు లభించింది. అటువంటిది మూడు సంవత్సరాలు అవుతున్నా మళ్లీ రంజీ మ్యాచ్‌ల ఊసే లేకపోవడం క్రీడాభిమానులకు తీరినిలోటే.
వైఫల్యం ఎక్కడ..?
కడప మైదానంలో నిర్వహించిన మూడు రంజీ మ్యాచ్‌లు సైతం ఫలితం తేలక డ్రాగా ముగిశాయి. దీంతో పిచ్ పట్ల బీసీసీఐ బృందం అసంతృప్తి వ్యక్తం చేసి.. పిచ్‌లను ఆధునీకరించాలని సూచించింది. ఇటీవలే మైదానానికి దాదాపు రూ.10 లక్షల వెచ్చించి మంచి వికెట్‌ను సైతం తీర్చిదిద్దారు. జిల్లాలో కేవలం అంతర్ జిల్లాల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారే తప్ప కనీసం రాష్ట్రస్థాయి మ్యాచ్‌లను కూడా ఈ యేడాది కేటాయించక పోవడం క్రీడాభిమానులకు మింగుడుపడని అంశం.
రంజీ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రయత్నం చేస్తాం..
ఈ ఏడాది అన్ని విభాగాల్లో అంతర్ జిల్లాల పోటీలు కడపకు కేటాయించారు. రంజీ మ్యాచ్‌ల కంటే ఎంతో ఆసక్తికరంగా ఉండే ఏపీఎల్ నిర్వహించేందుకు మా ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో కడపకు ఏపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారు. అయితే మ్యాచ్‌లపై కాస్త స్తబ్ధత ఉంది. రాష్ట్రంలో ఏపీఎల్ ప్రారంభమైతే కడపలో ఖచ్చితంగా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. వచ్చే యేడాది క్రికెట్ సీజన్‌లో రంజీ మ్యాచ్‌లను కడపలో నిర్వహించేందుకు ఏసీఏ సహకారంతో కృషిచేస్తాం. – ఎం. వెంకటశివారెడ్డి, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment