Ranji matches
-
రంజీ మ్యాచ్‌లు రావా..?
12 ఎకరాల్లో కడప నగరంలో ఏర్పాటైన పచ్చటి క్రికెట్ మైదానం ఇక కేవలం చిన్న చిన్న మ్యాచ్‌లకే పరిమితమా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.. కడప కంటే వెనుక ఏర్పాటైన మైదానాలకు సైతం రంజీ మ్యాచ్‌లు కేటాయిస్తుంటే అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగి ఉండటంతో పాటు గతంలో మూడు రంజీ మ్యాచ్‌లు నిర్వహించిన అనుభవం ఉన్న కడపకు ఈ సీజన్లో ఎటువంటి స్టేట్మ్యాచ్లు ఇవ్వకపోవడంతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రంజీ మ్యాచ్ కూడా కేటాయించకపోవడం చూస్తుంటే కడప మైదానం పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ఉన్న అభిమానం ఏపాటిదో ఇట్టే అర్థమైపోతోంది. జిల్లా క్రికెట్ సంఘం పాత్ర పరిమితమేనా..! జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా దాదాపు 25 సంవత్సరాలుపైగా ఎం. వెంకటశివారెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌లో సైతం గట్టి పట్టు ఉండటంతో రెండుసార్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవిలో సైతం కొనసాగుతున్నారు. ఈయనతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిన డి. నాగేశ్వరరాజు సౌత్‌జోన్ కార్యదర్శిగా, సౌత్‌జోన్ కార్యదర్శిగా పనిచేసిన ఉమామహేశ్వర్‌రావుకు ఏసీఏ ఎస్టేట్ మేనేజర్‌గా ఏసీఏలో కీలకమైన సభ్యులుగా ఉన్నారు. వీరు తలచుకుంటే ఏసీఏలో చక్రం తిప్పి జిల్లాకు రంజీలు వచ్చేలా చేయగల శక్తి ఉన్నవారే. అయినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మ్యాచ్‌లు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. ఏపీఎల్పైనా నీలి నీడలు..? ఈ ఏడాది డిసెంబర్–జనవరి మధ్య కాలంలో కడప నగరంతో పాటు మరో మూడు మైదానాల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించేలా ఏసీఏ నిర్ణయించింది. పోటీల్లో పాల్గొనేందుకు 6 క్రీడాజట్లను సైతం వివిధ పేర్లతో ఖరారు చేసింది. దీంతో రంజీలు రాకపోయినా మంచి మ్యాచ్‌లు చూసే అవకాశం లభించిందనుకున్న జిల్లా క్రీడాకారుల ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. కడప స్పోర్ట్స్ : నగర పరిధిలోని పుట్లంపల్లెలో 11.6 ఎకరాల్లో రూ. 8 కోట్లతో వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం ఏర్పాటైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల మూలనిధిని అందజేశారు. దీంతో 2009లో ప్రారంభమై 2011 నాటికి మైదానం అందుబాటులోకి వచ్చింది. 2011 డిసెంబర్ 6 నుంచి 9 వరకు తొలి రంజీ మ్యాచ్ ఆంధ్రా–విదర్భ జట్ల మధ్య సాగింది. 2012 డిసెంబర్ 29 నుంచి 2013 జనవరి 1వ తేదీ వరకు ఆంధ్రా–కేరళ జట్ల మధ్య రెండో రంజీ నిర్వహించారు. తర్వాత 2013 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వ తేదీ వరకు మూడో రంజీ మ్యాచ్ ఆంధ్రా–మహారాష్ట్ర జట్ల మధ్య సాగింది. అప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కడపలోని మైదానానికి రంజీ మ్యాచ్‌లను కేటాయించకపోవడం గమనార్హం. అభిమానుల ఆశలు ఆవిరి.. పెద్దపెద్ద నగరాలకు వెళ్లి క్రికెట్ చూడలేని క్రీడాభిమానులకు కడప నగరంలో చక్కటి మైదానం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్వహించిన మూడు రంజీ మ్యాచ్‌లలో సైతం అంతర్జాతీయ క్రికెటర్లు కడప గడపలో అడుగిడిన వేళ క్రీడాకారుల ఆనందం చెప్పలేనిది. కడప నగరంలోని మైదానానికి అంతర్జాతీయ ఆటగాళ్లు సాయిరాజ్బహుతులే, హేమాంగ్ బదాని, అమొల్ మజుందార్, సంజు శ్యాంసన్, శివసుందర్దాస్, వేణుగోపాల్, శ్రీశాంత్ తదితర ఆటగాళ్లతో పాటు ప్రస్తుత భారతజట్టు ఆటగాడు కేదార్‌జాదవ్ వంటి ఆటగాళ్లను నేరుగా తిలకించే అవకాశం జిల్లా వాసులకు లభించింది. అటువంటిది మూడు సంవత్సరాలు అవుతున్నా మళ్లీ రంజీ మ్యాచ్‌ల ఊసే లేకపోవడం క్రీడాభిమానులకు తీరినిలోటే. వైఫల్యం ఎక్కడ..? కడప మైదానంలో నిర్వహించిన మూడు రంజీ మ్యాచ్‌లు సైతం ఫలితం తేలక డ్రాగా ముగిశాయి. దీంతో పిచ్ పట్ల బీసీసీఐ బృందం అసంతృప్తి వ్యక్తం చేసి.. పిచ్‌లను ఆధునీకరించాలని సూచించింది. ఇటీవలే మైదానానికి దాదాపు రూ.10 లక్షల వెచ్చించి మంచి వికెట్‌ను సైతం తీర్చిదిద్దారు. జిల్లాలో కేవలం అంతర్ జిల్లాల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారే తప్ప కనీసం రాష్ట్రస్థాయి మ్యాచ్‌లను కూడా ఈ యేడాది కేటాయించక పోవడం క్రీడాభిమానులకు మింగుడుపడని అంశం. రంజీ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రయత్నం చేస్తాం.. ఈ ఏడాది అన్ని విభాగాల్లో అంతర్ జిల్లాల పోటీలు కడపకు కేటాయించారు. రంజీ మ్యాచ్‌ల కంటే ఎంతో ఆసక్తికరంగా ఉండే ఏపీఎల్ నిర్వహించేందుకు మా ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో కడపకు ఏపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారు. అయితే మ్యాచ్‌లపై కాస్త స్తబ్ధత ఉంది. రాష్ట్రంలో ఏపీఎల్ ప్రారంభమైతే కడపలో ఖచ్చితంగా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. వచ్చే యేడాది క్రికెట్ సీజన్లో రంజీ మ్యాచ్‌లను కడపలో నిర్వహించేందుకు ఏసీఏ సహకారంతో కృషిచేస్తాం. – ఎం. వెంకటశివారెడ్డి, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు -
అది క్రికెట్ కు హానికరం: ద్రవిడ్
కోల్ కతా: ఇటీవల రెండు, మూడు రోజుల్లో ముగుస్తున్నరంజీ మ్యాచ్ ల పట్ల టీమిండియా-ఏ, అండర్ -19 క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అధికంగా టర్న్ అయ్యే పిచ్ ల్లో బౌలర్ ఆరు నుంచి ఏడు వికెట్లు తీసినా లాభం ఏమీ ఉండదన్నాడు. ఈ తరహా పిచ్ లను రూపొందించడం క్రికెట్ కు హానికరమని అభిప్రాయపడ్డాడు. ఆ పిచ్ ల వల్ల సమయంతో పాటు ఖర్చు పెట్టిన డబ్బు కూడా వృథాగానే మిగిలిపోతుందన్నాడు. రంజీ ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు వారు ఎటువంటి పిచ్ లపై వికెట్లు తీశారనేది అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నాడు. రాబోవు తరం క్రికెటర్ల టాలెంట్ పై మాట్లాడిన ద్రవిడ్ .. రంజీ మ్యాచ్ ల్లో సహసిద్ధమైన పిచ్ లపై వికెట్లు తీసిన ఆటగాళ్లకే భవిష్యత్తు ఉంటుందన్నాడు. 'రెండు రోజల్లో మ్యాచ్ ముగిసిపోయే పిచ్ ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు మాకు అక్కర్లేదు. రంజీల్లో గుడ్ వికెట్ పై రాణిస్తేనే పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాని ఓవర్ టర్న్ అయ్యే పిచ్ ల్లో వికెట్లతో మెరిసినా లాభం లేదు. ఆ పిచ్ ల్లో తీసిన వికెట్లు అంతర్జాతీయ క్రికెట్ లో ఉపయోగపడవు. అటువంటి పిచ్ ల వల్ల సమయంతో పాటు డబ్బు కూడా వృథానే అవుతుంది' ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ టర్నింగ్ వికెట్ ను రూపొందించాలనుకుంటే నాకౌట్ దశలో జరిగే మ్యాచ్ లకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఇకనైనా ఆయా రాష్ట్రాలు తప్పకుండా గుడ్ వికెట్ ను రూపొందించాల్సిన అవసరం ఉందని ద్రవిడ్ కోరాడు. -
వసీం జాఫర్ అరుదైన రికార్డు
కోల్ కతా: భారత మాజీ ఓపెనర్, విదర్భ ఆటగాడు వసీం జాఫర్(37) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీల్లో పదివేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. గ్రూప్-ఎ లో భాగంగా ఆదివారం ఇక్కడ సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో జాఫర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. బెంగాల్ సీమర్ వీర ప్రతాప్ వేసిన ఎనిమిదో ఓవర్ లో బౌండరీ సాధించి జాఫర్ పది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. 1934-35లలో రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆరంభమైన తరువాత పదివేల పరుగుల మార్కును చేరుకున్న మొదటి ఆటగాడిగా జాఫర్ గుర్తింపు పొందాడు. జాఫర్ తరువాత రేసులో ముంబై ఆటగాడు ఆమోల్ ముజుందార్(9202), ఢిల్లీ ఆటగాడు మిథున్ మన్హాస్(8197) లు ఉన్నారు. 1996-97లో ముంబై తరపున రంజీ కెరీర్ ను ఆరంభించిన జాఫర్ ఎక్కువ కాలం ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకూ జాఫర్ 229 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడగా.. వాటిలో126 రంజీ మ్యాచ్ లు ఉన్నాయి. రంజీల్లో 10002 పరుగులు చేసిన జాఫర్, దులీప్ ట్రోఫీలో 2545, ఇరానీ ట్రోఫీలో 1008 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ మొత్తంగా చూస్తే జాఫర్ 17088 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 51 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా జాఫర్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. జాఫర్‌కు ముందు గవాస్కర్, సచిన్ టెండూల్కర్ , రాహుల ద్రవిడ్ , విజయ్ హజారే, వెంగ్ సర్కార్, వీవీఎస్ లక్ష్మణ్ , అజహరుద్దీన్ లు ఈ జాబితాలో ఉన్నారు. -
ఐపీఎల్‌కూ గుడ్‌బై...
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు లీగ్ నుంచీ తప్పుకున్న సెహ్వాగ్ న్యూఢిల్లీ: భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే ముందుగా హర్యానా క్రికెట్ సంఘానికి ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్లో రంజీ మ్యాచ్‌లు మాత్రం ఆడతాడు. ఆ తర్వాత మాజీ క్రికెటర్లు ఆడే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) లో బరిలోకి దిగుతాడు. వాస్తవానికి సోమవారం దుబాయ్‌లో జరిగిన ఎంసీఎల్ కార్యక్రమంలోనే వీరూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే ఈ విషయంలో పూర్తి స్పష్టత లేకపోవడంతో... మంగళవారం అధికారికంగా ఓ వీడియో ప్రకటన విడుదల చేశాడు. మంగళవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి 37వ పుట్టిన రోజు జరుపుకుంటూ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. వీరూ ప్రకటన అతని మాటల్లోనే... ‘నేనెప్పుడూ ఏది కరెక్ట్ అనుకుంటానో అదే చేస్తాను. దేవుడి దయవల్ల నేను సాధించాలనకున్నవి చాలా సాధించాను. నా 37వ పుట్టినరోజు రిటైర్ కావాలని చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్ నుంచి, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాను. క్రికెట్ నా జీవితం. భారత్ తరఫున ఆడటం మరచిపోలేని ప్రయాణం. నా సహచరులకు, అభిమానులకు మంచి జ్ఞాపకాలను అందించడంలో నేను విజయం సాధించాననే అనుకుంటున్నాను. చాలా సంవత్సరాలుగా నాతో కలిసి ఆడిన ఆటగాళ్లలో ఎందరో దిగ్గజాలు ఉన్నారు. వాళ్లందరితో పాటు భారత క్రికెట్ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద మీరు చూపించిన ప్రేమ, అందించిన మద్దతు, జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. నా సుదీర్ఘ కెరీర్లో ఎంతోమంది గొప్ప ప్రత్యర్థులతో ఆడగలిగాను. ప్రపంచంలో ఎన్నో గొప్ప మైదానాల్లో నా సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశం రావడం నా అదృష్టం. సచిన్, గవాస్కర్, కపిల్ నా రోల్ మోడల్స్. వారి ఆటను చూస్తూ పెరిగా, వారి దగ్గరి నుంచి చాలా నేర్చుకున్నా. పాజిటివ్ దృక్పథం కారణంగానే నేను పరుగులు చేయగలిగాను. తొలి ట్రిపుల్ సెంచరీ, వన్డే ప్రపంచకప్ గెలవడం మరచిపోలేని జ్ఞాపకాలు. నాలో టెస్టు ఆటగాడు ఉన్నాడని గుర్తించింది గంగూలీ. తను నా కోసం వన్డే ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేశాడు. ఎంతో నమ్మకం ఉంచాడు. తను చేసిన మేలును ఎప్పటికీ మరచిపోలేను. నా సుదీర్ఘ కెరీర్లో మురళీధరన్ బౌలింగ్ అంటే భయపడేవాడిని. నా క్రికెట్ ప్రయాణం ప్రారంభమైనప్పుడు మా నాన్న ఉన్నారు. రిటైర్ అవుతున్న రోజు కూడా ఆయన ఉంటే బాగుండేది. ఆయన ఏ లోకంలో ఉన్నా నన్ను చూసి గర్వపడుతున్నారనే అనుకుంటున్నా. నేను ఓ మంచి ఆటగాడిగా ఎదగడానికి కారకులైన కోచ్ ఎ.ఎన్.శర్మగారు. ఆయన వల్లే నేను ఎదిగాను. మా అమ్మ, నా భార్య, పిల్లలు నా బలం. ఢిల్లీ క్రికెట్ సంఘం, బీసీసీఐ మద్దతును ఎప్పటికీ మరవలేను. ఏ స్థాయి క్రికెట్లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా నా అత్యుత్తమ క్రికెట్ ఆడాను. ఇకపై జజ్జర్‌లోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్కువ సమయం గడుపుతా. ఏదో ఒక రూపంలో ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. కామెంటేటర్‌గా లేదా కోచ్‌గా ఏదో ఒక రూపంలో మళ్లీ కనిపిస్తా. ఎందుకంటే క్రికెట్ లేకుండా నేను ఉండలేను.’ థాంక్యూ వీరూ... ఏంటీ షాక్... మనసు జీర్ణించుకోలేకపోతోంది. సెహ్వాగ్ ఆటను ఇక చూడలేమా..? అంతర్జాతీయ క్రికెట్లో సరే. ఐపీఎల్‌లోనూ అతను ఆడటం లేదా..? ఎందుకీ కఠిన నిర్ణయం. ఏం వయసైపోయిందని అప్పుడే రిటైరవుతున్నాడు..! తొలి ఓవర్లోనే అలా బంతులు ఎగిరి స్టాండ్‌లో పడుతుంటే మేం తీన్మార్ వేయడం ఇష్టం లేదేమో..! జిడ్డురా బాబూ అంటూ టెస్టులకు రాని స్నేహితులు, వీరూ ఉన్నాడురా అంటే ఉరుకుతూ వచ్చేవాళ్లు. పొగరుగా ఎగిరే షోయబ్ అక్తర్ బంతిని అలవోకగా సిక్సర్ బాదుతుంటే... ఎవరినైనా భయపెట్టే బ్రెట్‌లీ బౌన్సర్‌ని స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే... స్టెయిన్ బుల్లెట్ బంతులు కూడా బౌండరీలు దాటుతుంటే... బంతిని ఎలా తిప్పుతాడో తెలియని వార్న్ కూడా తలపట్టుకుంటే... దానర్థం ఒక్కటే. అక్కడ సెహ్వాగ్ ఆడుతున్నాడని. 1999లో సెహ్వాగ్ జట్టులోకి వచ్చినా రెండేళ్ల పాటు సాధారణ క్రికెటర్లలో ఒకడు మాత్రమే. 2001లో కొలంబోలో న్యూజిలాండ్‌పై 69 బంతుల్లోనే సెంచరీ బాదినప్పుడు తొలిసారి అనిపించింది... ఆహా... ఏం ఆటగాడు దొరికాడురా అని. అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు భారత అభిమాని ఎప్పుడూ వినోదం కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. సచిన్ లాంటి దిగ్గజంతో సరిసమానంగా షాట్లు ఆడాలంటే ఎంత గొప్ప ఆటగాడై ఉండాలి. ప్రత్యర్థులు 300 లక్ష్యాన్ని ఎదురుగా ఉంచినా... వీరూ పది ఓవర్లు ఉంటే చాలురా బాబూ అనుకునేవాళ్లం. ఎదురుగా ఎంత గొప్ప బౌలర్ ఉన్నా అదురూ బెదురూ లేదు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న పిచ్‌పై కూడా పునరాలోచన లేదు. బాదడం ఒక్కటే తెలుసు. ఉన్నంతసేపు దడదడలాడిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడమే తెలుసు. 95 పరుగుల మీద ఒక్క బంతి కూడా వృథా చేయకుండా సిక్సర్ కొట్టాలంటే ఎంత ధైర్యం కావాలి. టెస్టు మ్యాచ్‌లో 294 పరుగుల దగ్గర స్పిన్నర్ బౌలింగ్‌లో ముందుకు రావాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే.. వీరూలాంటి విధ్వంసం మరెవరికీ సాధ్యం కాదు. గత దశాబ్ద కాలంలో... ఆ మాటకొస్తే క్రికెట్లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్. తను రిటైరైతే క్రికెట్ ప్రపంచం రిచర్డ్స్‌ను గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ ఒక్క పోలిక చాలు తను అభిమానులు, సహచరుల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో చెప్పడానికి. నిజానికి సెహ్వాగ్ భారత్ తరఫున ఆడి రెండేళ్లు దాటిపోయింది. అయినా అభిమానులు తనని మరచిపోలేదు. ఐపీఎల్లో ఈ రెండేళ్లూ పంజాబ్ ఆడిన మ్యాచ్‌లను విరగబడి చూశారు. అక్కడ వీరూ విధ్వంసాన్ని చూసుకుని మురిసిపోయారు. ఇకపై అదీ చూసే అవకాశం లేదని తలచుకుంటేనే అదోలా ఉంది. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజు భారత అభిమాని ఏం కోల్పోయాడని భావించాడో... ఇప్పుడు వీరూ ఇక ఆడడని తెలిసినా అదే బాధను అనుభవిస్తున్నాడు. ఆటపై తను వేసిన ముద్ర అలాంటిది. సచిన్‌లాంటి దిగ్గజం చాటున కూడా తన ప్రతిభతో, విధ్వంసంతో చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. టెస్టుల్లో అనేక మంది భారత దిగ్గజాలకు సాధ్యం కాని ట్రిపుల్ సెంచరీ ఘనతను రెండుసార్లు సాధించాడు. నిజానికి గత ఏడాది డిసెంబరులోనే... రిటైర్మెంట్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు. ‘నేను సాధించాల్సింది ఏమీ లేదు. అనుకున్నదానికంటే ఎక్కువ ఘనతలు సొంతం చేసుకున్నాను. ఇక ఆటను ఆస్వాదించడానికి మాత్రమే ఆడుతున్నాను’ అనే మాటతో తిరిగి భారత జట్టులోకి రావడానికి ప్రత్యేక ప్రయత్నాలు లేవని అర్థమైంది. వీరూ భారత జట్టుకు దూరమవడానికి కారణాలు ఏమైనా కావచ్చు. ఆ చర్చ జోలికి ఇప్పుడు వెళ్లడం అనవసరం. కానీ ఇంత గొప్ప క్రికెటర్ ఇలా సాధారణంగా రిటైర్ కావడం మాత్రం బాధ కలిగించే అంశం. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడికి ఓ గౌరవప్రదమైన వీడ్కోలు దొరికి ఉంటే బాగుండేది. ఇందుకు భారత క్రికెట్ వీరూకు సారీ చెప్పాలి. ఏమైనా.. దశాబ్దంపాటు అందులేని వినోదాన్ని అందించినందుకు థాంక్స్ చెప్పి తీరాలి. - సాక్షి క్రీడావిభాగం మాటల్లోనూ ఘనాపాటి! * ఈతరం క్రికెటర్లలో సెహ్వాగ్ తరహాలో కుండబద్దలు కొట్టినట్లు ఎవరూ మాట్లాడలేరు. బ్యాటింగ్‌తోనే కాదు మాట లతో కూడా ‘పంచ్’లు విసిరే అతని వ్యాఖ్యల్లో కొన్ని... * ‘బ్యాంక్ బ్యాలెన్స్ (సచిన్‌కు తనకు తేడా ఏమిటనే ప్రశ్నకు) * ‘బంతి విసురుతున్నాడా...బిచ్చం అడుగుతున్నాడా...(తన బౌలింగ్‌లో హుక్ చేయమంటూ పదే పదే రెచ్చగొట్టిన అక్తర్ గురించి) * ‘ఆయన రోజంతా ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టిన విషయం మరచిపోయాడా (ప్రతిభ ఉన్నా బుర్ర లేదంటూ తనపై వ్యాఖ్య చేసిన బాయ్‌కాట్ గురించి) * ‘ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే రెండు ట్రిపుల్ సెంచరీలు చేసి మరొకటి కొద్దిలో మిస్ అయ్యారు. అస్సలు నిరాశ లేదు’ (ముంబైలో 293 తర్వాత) * ‘94 మీద ఉన్నావు. సిక్సర్ కొట్టి సెంచరీ చేయవచ్చుగా’ (లక్ష్మణ్‌కు క్రీజ్‌లో రన్నర్‌గా వచ్చి సలహా) ప్రశంసల వెల్లువ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు క్రికెట్ ప్రపంచంతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కావలసిన వినోదాన్ని సెహ్వాగ్ అందించాడు. ఎంతోమంది యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపాడు. అతని భవిష్యత్తు బాగుండాలి’ -శశాంక్ మనోహర్ సెహ్వాగ్‌కు నా అభినందనలు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. భారత క్రికెట్‌కు తను రిచర్డ్స్. దిగ్గజాల్లో ఒకడిగా ఆటకు వీడ్కోలు చెబుతున్నాడు. అంకితభావం ఉంటే ఎలా ఎదగొచ్చో వీరూను చూసి నేటి తరం క్రికెటర్లు నేర్చుకోవాలి’ - అనురాగ్ ఠాకూర్ రిచర్డ్స్ బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లను సెహ్వాగ్ బాదడం కళ్లారా చూశాను. వీరూలాంటి మైండ్‌సెట్ ఉన్న ఆటగాడిని చూడలేం. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ కోసం ఆడే చోట వీరూ బౌండరీ కోసం ప్రయత్నిస్తాడు’ -ధోని వీరూ భాయ్ నీతో కలిసి ఆడగలగడం నా అదృష్టం. నీది అద్భుతమైన కెరీర్. నీ మార్గదర్శకత్వానికి, నువ్విచ్చిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆధునిక క్రికెట్లో నువ్వు దిగ్గజం’ -కోహ్లి శుభాకాంక్షలు వీరూ. నువ్వు అద్భుతమైన వినోదాన్ని అందించావు. ఎన్నో గొప్ప జ్ఞాపకాలను అందించినందుకు కృతజ్ఞతలు -లక్ష్మణ్ ఆటలోనూ, జీవితంలోనూ సెహ్వాగ్ దృక్పథం అంటే నాకు చాలా ఇష్టం. తను ఆడిన ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ను రెండో ఎండ్‌లో నిలబడి చూశాను. మనందరిలో ఇంకా సంతోషాన్ని, నవ్వులను వీరూ తెస్తాడు. తన ప్రదర్శనలతో ఆటపై తన ముద్రను వేసి వెళుతున్నాడు’ -సచిన్ టాపార్డర్‌లో సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసే క్రికెటర్ మరొకరు లేరు. జట్టు కోసం ఎప్పుడూ కష్టపడేవాడు. తన రెండో ఇన్నింగ్స్ కూడా సంతోషంగా సాగాలి’ -కుంబ్లే -
కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీ
ఒంగోలు: గోవాతో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్ లో ఆంధ్రా ఆటగాడు కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం ప్రారంభమైన తొలి రోజే డబుల్ సెంచరీ చేసిన భరత్.. రెండో రోజు కూడా తనదైన శైలిలో ఆడి ట్రిపుల్ సెంచరీ(308)పరుగులు నెలకొల్పాడు. దీంతో ఆంధ్రా భారీ స్కోరు నమోదు చేసింది. తొలిరోజు 400 పరుగులకు పైగాసాధించిన ఆంధ్రా ఆటపై మరింత పట్టుబిగించింది. గోవా బౌలర్లను చితక్కొట్టిన ఆంధ్ర బ్యాట్స్‌మెన్ దాదాపు 4.53 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. -
ఆంధ్రా కెప్టెన్ గా మహ్మద్ కైఫ్!
కాన్పూర్: గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీంఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. ఇక ఆ రాష్ట్రానికి గుడ్ బై చెప్పనున్నాడు. రాబోయే రంజీ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ తరుపున బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నాడు. 16 సంవత్సరాలుగా యూపీ తరుపున ఆడిన ఈ క్రికెటర్.. త్వరలో ఆంధ్రా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. యువకులను వెలుగులోకి తెచ్చేందుకు యూపీ క్రికెట్ అసోసియేషన్ నడుంబిగించడంతో కైఫ్ కు ముగింపు పలికింది. దీనిలో భాగంగానే కైఫ్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ తో రెండు సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నాడు. ఫస్ట్ క్రికెట్ లో మంచి రికార్డు ఉన్న కైఫ్ సేవలను ఆంధ్రా రంజీ క్రికెట్ అసోసియేషన్ వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకూ కైఫ్ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 9,277 పరుగులు, 143 క్యాచ్ లు, 20 వికెట్లు తీసుకున్నాడు.