వసీం జాఫర్ అరుదైన రికార్డు
కోల్ కతా: భారత మాజీ ఓపెనర్, విదర్భ ఆటగాడు వసీం జాఫర్(37) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీల్లో పదివేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. గ్రూప్-ఎ లో భాగంగా ఆదివారం ఇక్కడ సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో జాఫర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. బెంగాల్ సీమర్ వీర ప్రతాప్ వేసిన ఎనిమిదో ఓవర్ లో బౌండరీ సాధించి జాఫర్ పది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. 1934-35లలో రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆరంభమైన తరువాత పదివేల పరుగుల మార్కును చేరుకున్న మొదటి ఆటగాడిగా జాఫర్ గుర్తింపు పొందాడు. జాఫర్ తరువాత రేసులో ముంబై ఆటగాడు ఆమోల్ ముజుందార్(9202), ఢిల్లీ ఆటగాడు మిథున్ మన్హాస్(8197) లు ఉన్నారు.
1996-97లో ముంబై తరపున రంజీ కెరీర్ ను ఆరంభించిన జాఫర్ ఎక్కువ కాలం ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకూ జాఫర్ 229 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడగా.. వాటిలో126 రంజీ మ్యాచ్ లు ఉన్నాయి. రంజీల్లో 10002 పరుగులు చేసిన జాఫర్, దులీప్ ట్రోఫీలో 2545, ఇరానీ ట్రోఫీలో 1008 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ మొత్తంగా చూస్తే జాఫర్ 17088 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 51 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా జాఫర్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. జాఫర్‌కు ముందు గవాస్కర్, సచిన్ టెండూల్కర్ , రాహుల ద్రవిడ్ , విజయ్ హజారే, వెంగ్ సర్కార్, వీవీఎస్ లక్ష్మణ్ , అజహరుద్దీన్ లు ఈ జాబితాలో ఉన్నారు.