క్రికెట్‌లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.
ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.
ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్‌క్రిస్ట్‌లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు.
కెప్టెన్‌గా ఆసీస్ లెజెండ్
ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు.
అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97.
మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు.
వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్
మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్‌క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.
ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్‌రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు.
అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్‌ను సెలక్ట్ చేశాడన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment