బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఉందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ టీమిండియాకు సూచించాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ బంగ్లా ప్రమాదకర జట్టుగా మారుతోందని.. ముఖ్యంగా విదేశీ గడ్డపై గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నాడు. కాబట్టి ప్రత్యర్థిని పసికూనగా భావిస్తే మూల్యం చెల్లించే పరిస్థితి రావొచ్చని రోహిత్ సేనను హెచ్చరించాడు.
రెండు మ్యాచ్‌ల సిరీస్
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనలిస్టులలో ఫేవరెట్‌గా ఉన్న భారత జట్టు.. గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగనుండగా.. టీమిండియా ఇప్పటికే అస్తశస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేనను ఢీకొట్టేందుకు బంగ్లాదేశ్ కూడా సిద్ధంగానే ఉంది.
ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే.. కానీ ఇప్పుడు
ముఖ్యంగా పాకిస్తాన్‌ను వారి గడ్డపై టెస్టుల్లో తొలిసారి ఓడించడమే కాదు.. ఏకంగా క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో ఉన్న నజ్ముల్ షాంటో బృందం.. భారత్‌లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ జట్టు అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత మెరుగ్గా తయారవుతోంది. ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే ఆడగలరని వారికి పేరు ఉండేది. అయితే, గత కొంతకాలంగా విదేశాల్లోనూ బంగ్లా రాణిస్తోంది.
కివీస్ గడ్డపై గెలిచిన ఘనత
న్యూజిలాండ్‌ను న్యూజిలాండ్‌లో(2022, మౌంట్ మౌంగనూయ్), పాకిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఓడించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఇప్పటికే ఇంటా బయటా తమను తాము నిరూపించుకున్నారు. జట్టులోని సీనియర్లు వారికి మార్గదర్శకులుగా ఉంటున్నారు. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ.. యువకులకు స్ఫూర్తినిస్తున్నారు.
నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు
గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన కోచ్‌ల ద్వారా కూడా బంగ్లాదేశ్ ఆట మెరుగుపడింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, నషీద్ రాణా, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్.. రాణిస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టు నలుగురైదుగురు ఫాస్ట్ బౌలర్లు గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు’’ అని వసీం జాఫర్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు. టీమిండియా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించాడు.
Comments
Please login to add a commentAdd a comment