టెస్టుల్లో త్వరలోనే ఎంట్రీ!.. గంభీర్‌ భయ్యా చెప్పారు: సంజూ | Sanju Samson Reveals Rohit, Gambhir Wants Him To Play Tests | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో త్వరలోనే ఎంట్రీ!.. గంభీర్‌ భయ్యా చెప్పారు: సంజూ

Published Wed, Oct 16 2024 11:17 AM | Last Updated on Wed, Oct 16 2024 12:03 PM

Sanju Samson Reveals Rohit, Gambhir Wants Him To Play Tests

కేరళ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడా? కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడించేందుకు సుముఖంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంజూ శాంసన్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.

దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సంజూ 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20ల సందర్భంగా అరంగేట్రం చేసిన అతడికి ఆరేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం లభించింది. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 16 వన్డేలు, 33 టీ20లు ఆడిన సంజూ శాంసన్‌.. ఆయా ఫార్మాట్లలో 510, 594 పరుగులు చేశాడు.

టీమిండియా తరఫున టీ20 సెంచరీ
ఇక వన్డేల్లో ఓ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ టీ20లో శతకం నమోదు చేశాడు. అయితే, పరిమిత ఓవర్ల జట్టులోనే ఇప్పటి వరకు సంజూకు నిలకడైన స్థానం లేదు. అయినప్పటికీ టెస్టుల్లోనూ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. మేనేజ్‌మెంట్‌ పిలిచి మరీ రెడ్‌బాల్‌ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని చెప్పడంతో లక్ష్యానికి చేరువవుతున్నాడు.

మేనేజ్‌మెంట్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది
ఈ విషయాల గురించి సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. ‘‘కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో రాణించగలననే నమ్మకం నాకుంది. టీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడాలనేది నా చిరకాల కోరిక.

దులిప్‌ ట్రోఫీ ఆరంభానికి ముందు నాకు నాయకత్వ బృందం(కెప్టెన్‌, కోచ్‌) నుంచి సందేశం వచ్చింది. రెడ్‌బాల్‌ క్రికెట్‌ జట్టులోనూ నా పేరును పరిశీలిస్తున్నామని మేనేజ్‌మెంట్‌లోని ముఖ్యులు చెప్పారు. రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని.. రెడ్‌బాల్‌ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు’’ అని పేర్కొన్నాడు.

గంభీర్‌ భయ్యా మద్దతు ఉంది 
అదే విధంగా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గౌతం భయ్యా నాకెల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డాడు. నిజానికి టీమిండియాకు ఆడుతున్నపుడు బ్యాటింగ్‌ స్థానం సుస్థిరంగా ఉండదు. 

మూడు వారాల ముందే చెప్పారు!
అయితే, బంగ్లాతో సిరీస్‌కు మూడు వారాల ముందే నేను ఓపెనర్‌గా రావాలని మేనేజ్‌మెంట్‌ చెప్పింది. కొత్త పాత్రలో ఇమిడిపోయేలా నేను మానసికంగా సిద్ధపడేందుకు తగిన సమయం ఇచ్చింది’’ అంటూ 29 ఏళ్ల సంజూ శాంసన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్‌ స్టార్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

సంజూకు అంత ఈజీ కాదు
కాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సంజూ శాంసన్‌ ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు ఆడి 38.96 సగటుతో 3819 పరుగులు చేశాడు. ఇందులో 11 శతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల దులిప్‌ ట్రోఫీ-2024లో ఇండియా-డి జట్టుకు ఆడిన అతడు మెరుపు సెంచరీ(101 బంతుల్లో 106) సాధించాడు. 

అయితే, టెస్టుల్లో వికెట్‌ కీపర్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌ పాతుకుపోగా.. ధ్రువ్‌ జురెల్‌ బ్యాకప్‌గా ఉన్నాడు. సంజూ కూడా రేసులోకి రావాలంటే వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌తో పాటు బ్యాటింగ్‌ పరంగానూ మరింత గొప్పగా రాణించాల్సి ఉంటుంది. అలా అయితే, జురెల్‌ను దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement