కేఎల్‌ రాహుల్‌ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్‌ | IND Vs AUS 1st Test Day 1, Mitchell Starc Reacts On KL Rahul DRS Controversial Dismissal, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్‌

Published Sat, Nov 23 2024 12:03 PM | Last Updated on Sat, Nov 23 2024 12:40 PM

Ind vs Aus 1st Test Day 1 Starc reacts on KL Rahul Controversial Dismissal

ఆస్ట్రేలియాతో పెర్త్‌ టెస్టులో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(26) అవుటైన తీరుపై మిచెల్‌ స్టార్క్‌ స్పందించాడు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ వేసిన  22వ ఓవర్‌ రెండో బంతికి.. రాహుల్‌ సందేహాస్పద రీతిలో పెవిలియన్‌ చేరాడు.

రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...
ఫీల్డ్‌ అంపైర్‌ మొదట నాటౌట్‌గా ప్రకటించగా... క్యాచ్‌ అవుట్‌ కోసం ఆసీస్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్‌ అంపైర్‌ రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.

తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌, కామెంటేటర్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్‌ను సమీపించిన సమయంలో అవుట్‌ సైడ్‌ ఎడ్జ్‌పై స్పైక్‌ కనిపించింది’ అని థర్డ్‌ అంపైర్‌ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.  

అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.

మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్‌ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్‌ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్‌ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.

ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం
అయితే, ఆసీస్‌ మాజీ సారథి‌ మార్క్‌వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్‌ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్‌ అంపైర్‌ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. 

మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్‌ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని  ట్వీట్‌ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్‌ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశాడు.

స్టార్క్‌ స్పందన ఇదే
ఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్‌ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి.. 150 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది.

చదవండి: హర్షిత్‌.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్‌ చేయగలను: స్టార్క్‌ వార్నింగ్‌.. రాణా రియాక్షన్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement