టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్‌లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.
ఈసారి టీమిండియా గెలవడం కష్టమే
ఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్‌లు గెలిచింది.
అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.
అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది
ప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.
కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్‌లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే.
అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్‌తో సిరీస్‌లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్‌లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.
చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్
Comments
Please login to add a commentAdd a comment