అది క్రికెట్ కు హానికరం: ద్రవిడ్
కోల్ కతా: ఇటీవల రెండు, మూడు రోజుల్లో ముగుస్తున్నరంజీ మ్యాచ్ ల పట్ల టీమిండియా-ఏ, అండర్ -19 క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అధికంగా టర్న్ అయ్యే పిచ్ ల్లో బౌలర్ ఆరు నుంచి ఏడు వికెట్లు తీసినా లాభం ఏమీ ఉండదన్నాడు. ఈ తరహా పిచ్ లను రూపొందించడం క్రికెట్ కు హానికరమని అభిప్రాయపడ్డాడు. ఆ పిచ్ ల వల్ల సమయంతో పాటు ఖర్చు పెట్టిన డబ్బు కూడా వృథాగానే మిగిలిపోతుందన్నాడు. రంజీ ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు వారు ఎటువంటి పిచ్ లపై వికెట్లు తీశారనేది అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నాడు. రాబోవు తరం క్రికెటర్ల టాలెంట్ పై మాట్లాడిన ద్రవిడ్ .. రంజీ మ్యాచ్ ల్లో సహసిద్ధమైన పిచ్ లపై వికెట్లు తీసిన ఆటగాళ్లకే భవిష్యత్తు ఉంటుందన్నాడు.
'రెండు రోజల్లో మ్యాచ్ ముగిసిపోయే పిచ్ ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు మాకు అక్కర్లేదు. రంజీల్లో గుడ్ వికెట్ పై రాణిస్తేనే పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాని ఓవర్ టర్న్ అయ్యే పిచ్ ల్లో వికెట్లతో మెరిసినా లాభం లేదు. ఆ పిచ్ ల్లో తీసిన వికెట్లు అంతర్జాతీయ క్రికెట్ లో ఉపయోగపడవు. అటువంటి పిచ్ ల వల్ల సమయంతో పాటు డబ్బు కూడా వృథానే అవుతుంది' ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ టర్నింగ్ వికెట్ ను రూపొందించాలనుకుంటే నాకౌట్ దశలో జరిగే మ్యాచ్ లకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఇకనైనా ఆయా రాష్ట్రాలు తప్పకుండా గుడ్ వికెట్ ను రూపొందించాల్సిన అవసరం ఉందని ద్రవిడ్ కోరాడు.