వైఎస్ రాజశేఖరరెడ్డి
ఏడేళ్ల వరుస కరువుతో పంట, పాడి పోయి పల్లెలన్నీ కన్నీరు పెడుతున్న రోజులవి.. కరెంటు బిల్లు కట్టలేదని రైతుల్ని లాక్కెళ్లి జైల్లో పెడుతున్న భయంకరమైన పాలనది.. కష్టజీవులు పొట్టచేత పట్టుకొని వలసపోగా ఊళ్లన్నీ గొల్లుమంటున్న కాలమది.. అది చంద్రబాబు జమానా.. జనం ఆశలన్నీ మోడువారిన సమయమది. అప్పుడు.. ‘నేనున్నానంటూ..’ అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.
అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమానికి తానే సంతకమైన వాడు.... అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకొని, జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను నేటికి సరిగ్గా ఒకటిన్నర దశాబ్దాల కింద, ఇదే రోజు... ఏప్రిల్ 9న (2003) డా.వైఎస్సార్ చేవెళ్ల (రంగారెడ్డి) నుంచి ప్రారంభించారు. 68వ రోజున ఇచ్ఛాపురం (శ్రీకాకుళం)లో ముగించారు.
ప్రజల గుండెల్లో పదిలం
ఆయన పాదయాత్ర చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన యాత్ర ఆయన్ను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా.. ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది. రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్’ అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించి దాదాపు తొమ్మిదేళ్లవుతున్నా, మధ్యలో పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘వైఎస్సార్’ ఓ శాశ్వత జ్ఞాపకం. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతుకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్... ఇలా ఏ పథకం తీసుకున్నా అది ఓ ప్రయోగం, అంతకు మించి ఓ ప్రామాణికం. అన్ని వయసుల వారికీ బతుకుపై ఓ భరోసా. అన్ని విధాలుగా అలమటించిన రైతన్నకు ఓ ఊరట, నిశ్చింత! విభిన్న వర్గాల ప్రజాజీవితంలో వెలుగులు పంచుతూ గ్రామీణ–పట్టణ ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించారు వైఎస్. రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రగతి పథంలో నడిపారు.
రెండంశాలే కీలకం!
చరిత్ర కలిగిన ఎందరో నాయకులకన్నా రాజశేఖరరెడ్డిని భిన్నంగా నిలబెట్టే అంశాలు రెండు! ఒకటి, ఆయనకు ప్రజల పట్ల ఉండే అవ్యాజమైన ప్రేమ–నిబద్ధత. రెండు.. ఆయన మాటలు, చేతలు, మొత్తం నడతపై ఉన్న అపార నమ్మకం–విశ్వసనీయత! ఈ రెండే వైఎస్‌ను చరిత్ర మరవని జననేతగా మలిచాయి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దుర్భరం. రైతు కన్నీళ్లతో వ్యవసాయం అడుగంటింది. పనుల్లేక చేతి వృత్తులు కునారిల్లాయి. ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లేక యువత నిస్తేజమైంది. తప్పు దారిన సాగిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఉరుముతున్న ప్రపంచీకరణ, రాష్ట్రాన్ని నాటి సీఎం చంద్రబాబు ప్రపంచబ్యాంకు ప్రయోగశాల చేసిన తీరు.. వెరసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. రాజకీయ నాయకులు ప్రజలకు ఏ భరోసా ఇవ్వలేకపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో వైఎస్సార్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. నేరుగా ప్రజల్నే కలవడం, విభిన్న సమాజాల వారి ఇబ్బందుల్ని, కష్ట–నష్టాల్ని స్వయంగా చూడటం, వారి కష్టాల్లో పాలుపంచుకోవడం, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించడం, జనానికి అండగా ఉంటానని భరోసా కల్పించడం... ఇవే తన పాదయాత్ర ఉద్దేశాలు, లక్ష్యాలని స్వయంగా ఆయనే వెల్లడించారు.
పాదయాత్ర మొదలైన ఆరంభ క్షణాల నుంచే ఆయనలోని మానవత పెల్లుబికింది. ఏప్రిల్ 9, మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండ కాస్తోంది. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభానికి ముందు జరిగిన సభా వేదికపైన నీడ కోసం టార్ఫాలిన్ కప్పు వేశారు. వేదిక ముందు పోగైన జనంలో అక్కడక్కడ మహిళలు చీర కొంగులతో, మగవాళ్లు తుండు గుడ్డలతో ఎండ నుంచి తలదాచుకునే యత్నం చేస్తున్నారు. ఏ జనం కష్టాల్లో పాలు పంచుకుంటానని వైఎస్ తన యాత్ర ప్రారంభిస్తున్నారో ఆ జనాన్ని పరిశీలిస్తున్న ఆయన కార్యాచరణ అక్కడ్నుంచే మొదలైంది. చురుకైన కార్యకర్తల్ని దగ్గరికి పిలిచి, వేదికపై నాయకులకు నీడగా ఉన్న టార్ఫాలిన్ తీసేయించారు. ఎండలోనే సభా కార్యక్రమం సాగింది.
అందుకే ఆయన.. ఇచ్ఛాపురం యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ఓ మాటన్నారు. ‘నా ప్రజలకంటే నేను భిన్నమని నేననుకోవటం లేదు. రాజకీయ లబ్ధి కోసం రాలేదు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకుందామని యాత్ర చేశా. పేదల సమస్యలపై పోరాటం సాగించడంలో ఆత్మ బలిదానానికైనా సిద్ధం’ అన్నారు. ఆ మాట అలా రావడం కాకతాళీయమే కావచ్చు! కానీ కడకు అదే జరిగింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉంది? కడపటి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందుతున్నాయా? స్వయంగా పరిశీలిస్తానని రచ్చబండకు ఆకాశమార్గాన బయలుదేరిన జననేత ఇక తిరిగి రాలేదు.
రోడ్డుపైనే తిండి, నిద్ర
అది ప్రజలతో మమేకమై సాగిన గొప్ప సాహసయాత్ర. చేవెళ్ల నుంచి వైఎస్సార్‌తో కలిసి నడిచాను. సింగూరు కాల్వలు కట్టిస్తామని ఇచ్చిన మాటను సీఎం అవగానే నిలబెట్టుకున్నారు. ఎక్కడ ఏ మాటిచ్చినా నిలబెట్టుకున్న గొప్ప నేత వైఎస్సార్. యాత్రలో రోడ్డు పైనే పడుకున్నారు. రోడ్డు మీదే తిన్నారు. ప్రజలు ఆయన్ను సొంతం చేసుకున్నారు. –దామోదర రాజనర్సింహ, మాజీ డిప్యూటీ సీఎం
అప్పుడు వైఎస్ కళ్లలో నీళ్లు తిరిగాయి
ప్రజా ప్రస్థానంలో చేవెళ్ల నుంచి మెదక్ దాకా నడిచాను. మా నాయకులకు ఆ పాదయాత్ర ఓ సందేçశం. ఆయన పట్ల జనం చూపిన ప్రేమ, ఆప్యాయత అపురూపం. ‘నాకు పింఛన్ లేదు. ఊళ్లో ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో నాకిస్తామన్నారు’ అని మెదక్ జిల్లాలో ఓ 70 ఏళ్ల అవ్వ చెప్పినప్పుడు వైఎస్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సీఎం కాగానే అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. – డీకే అరుణ, మాజీ మంత్రి
వీడ్కోలు చెబుతూ ఏడ్చేశాం
మెదక్ జిల్లాలో 5 రోజులు వైఎస్‌తో కలిసి నడిచా. చిట్కుల్ సభకు 50 వేల మంది వచ్చారు. దాన్ని నా పేరు చెబుతూ ఆయన అంతటా ప్రస్తావించడం ఆనందాన్నిచ్చింది. జిల్లాలో యాత్ర పూర్తయ్యేప్పుడు పోచంపాడు డ్యాం వద్ద వీడ్కోలు పలికాం. మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపే సమయంలో కుటుంబీకులందరూ ఎలా కంటతడి పెడ్తారో అలాగే మేమంతా ఏడ్చాం. – సునీతారెడ్డి, మాజీ మంత్రి
ఎంతో గొప్ప ముందడుగు
వైఎస్ పాదయాత్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లాలో మిడ్‌మానేరుతోపాటు వరద కాల్వ ద్వారా జిల్లాలోని రైతులకు సాగునీరందించే అవకాశం వైఎస్సార్ వల్లే సాధ్యమైంది. యాత్రలోనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పునాది పడింది. ఎవరెన్ని యాత్రలు చేసినా వైఎస్సార్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి
అది ప్రజా యాత్ర
పాదయాత్ర కరీంనగర్ జిల్లా గంభీరావ్‌పేట చేరినప్పుడు అనేక మందిమి స్వాగతం పలికాం. ప్రజా సమస్యలను తన వెంట ఉన్న పర్సనల్ సెక్రటరీలు, పార్టీ బాధ్యులు నమోదు చేసుకుంటున్నారా, లేదా అని వైఎస్ ఎప్పటికప్పుడు ఆరా తీసేవారు. – టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత
చిరునవ్వుతో పలకరించేవారు
యాత్రలో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా నడిచాను. జనాన్ని వైఎస్ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించడం, ధైర్యమివ్వడం ఎప్పుడూ మరిచిపోలేను. ప్రజలు ఏం కోరుకుంటున్నారో రోజూ డైరీలో రాసుకునే వారు. – డి.సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఎల్‌బీనగర్
Comments
Please login to add a commentAdd a comment