అందమైన కాలనీలు.. పేదలకు ఆవాసాలు | YSR Jagananna Colonies with all facilities in AP | Sakshi
Sakshi News home page

అందమైన కాలనీలు.. పేదలకు ఆవాసాలు

Published Sun, Jun 7 2020 3:38 AM | Last Updated on Thu, Apr 14 2022 1:24 PM

YSR Jagananna Colonies with all facilities in AP - Sakshi

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఒక కొత్త చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో దాదాపు 20 శాతం కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలు రూపుదిద్దుకుంటుండటం కనిపిస్తోంది. కాలనీల ఏర్పాటు గతంలోలా బలహీన వర్గాల గృహ సముదాయంలా ఉండదు. ఎలాంటి వసతుల్లేని అగ్గిపెట్టెల్లాంటి.. డబ్బాల్లాంటి ఇళ్లు కాదు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అర్హత ఉన్నప్పటికీ ఇంటి స్థలం రాలేదని ఎవరైనా అంటే.. ఏ విధంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలో అందులో సూచించారు. వారి దరఖాస్తులు తీసుకుని అర్హత ఉంటే వెంటనే మంజూరు చేస్తున్నారు. ఇదంతా పారదర్శక పద్దతుల్లో, అవినీతికి తావు లేకుండా జరిగిపోయింది. ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాల్లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లే అవుట్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో అంతర్గత రహదారులతో సహా సిద్ధమైన ఇళ్ల లేఅవుట్‌  

మౌలిక సదుపాయాలకు పెద్దపీట 
► అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని మామూలుగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రచారం చేసుకుంటుండటం మనం చూశాం. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రీతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని పరితపిస్తూచర్యలు తీసుకుంటోంది. 
► ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఇల్లు లేని అర్హులందరికీ నివాస స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్న లే అవుట్లలో మౌలిక సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు.  
► రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు తెల్ల కార్డే అర్హతగా ఎంపిక చేసిన  సుమారు 30 లక్షల మందికి నివాస స్థలాలను విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్‌ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.  
 
30 అడుగుల రోడ్లు  
► ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూపొందిస్తున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీ(లేఅవుట్ల)ల్లో 30 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు నిర్మించనున్నారు. విశాలమైన రోడ్ల నిర్మాణానికి స్థలాలు వదిలేసి ప్లాట్లు వేస్తున్నారు.  
► కొన్ని జిల్లాల్లో అక్కడి పరిస్థితులు, లేఅవుట్‌ పరిమాణాన్ని బట్టి 40 నుంచి 60 అడుగుల వెడల్పుతో ప్రధాన రోడ్ల నిర్మాణానికి వీలుగా లేఅవుట్లు ప్లాన్‌ చేశారు.    

విజయనగరం జిల్లాలో అతి పెద్ద లే అవుట్‌..
► జిల్లా కేంద్రమైన విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామంలో 357.50 ఎకరాల్లో అతి పెద్ద లేఅవుట్‌ రూపొందిస్తున్నారు.  
► ఇక్కడ పోలీస్‌ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు బజార్లు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందించడానికి లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు.  

సామాజిక అవసరాల కోసం స్థలాలు  
► అధిక విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న పెద్ద లేఅవుట్ల(కాలనీల)లో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఖాళీ స్థలాలు వదిలేసి ప్లాట్లు ప్లాన్‌ చేశారు.  
► సామాజిక అవసరాలకు అవసరమైనంత మేరకు స్థలాలు వదిలేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏమి కావాలన్నా అక్కడే దొరికే విధంగా వీటిని ప్లాన్‌ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.   

పచ్చని తోటల మధ్య..   
► చాలా చోట్ల గ్రామాలకు, పట్టణాలకు ఆనుకొని పచ్చని తోటలు, చెట్లతో నిండిన కొండలు, పొలాల పక్కన జగనన్న కాలనీల కోసం స్థలాలు ఎంపిక చేశారు.  
► దీంతో గృహ నిర్మాణం తర్వాత అక్కడ నివసించే వారికి స్వచ్ఛమైన గాలి అందనుంది. పచ్చదనంతో వాతావరణం కూడా చల్లగా ఉండనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండ్ల తోటలు, పచ్చని పొలాల పక్కన లే అవుట్లు చూడ ముచ్చటగా రూపు దిద్దుకుంటున్నాయి.  ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి కాలనీలకు అవసరమైన తాగునీరు, విద్యుత్తు సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది.   

నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు... 
► దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వచ్చే నెల 8వ తేదీన 29 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
► ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ఉద్దేశం కాదని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇల్లు లేని కుటుంబం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. అందువల్ల నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు.  

ఒకే నమూనాలో ఇళ్లు 
► పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత నిర్మించే కాలనీలకు వైఎస్సార్‌ జగనన్న కాలనీ అని పేరు పెట్టనున్నారు. ఈ కాలనీల్లో ఇళ్లన్నీ ఒకే నమూనాలో నిర్మిస్తారు. ప్రతి ప్లాటుకు నంబర్‌ ఉంటుంది.  
► బెడ్‌రూమ్, పెద్ద హాలు, కిచెన్, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు నిర్మించేలా ప్లాన్‌ రూపొందించారు.  
► ప్రతి కాలనీలో డ్రైనేజి, తాగునీటి పైపులైను, విద్యుత్తు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.  
► తూర్పు గోదావరి జిల్లా 3,65,224 మంది లబ్ధిదారులతో ప్రథమ స్థానంలో ఉంది. కొత్తగా వచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులను ఎంపిక చేశాక ఈ సంఖ్య మరింత పెరగనుంది. ధరలు ఎక్కువగా ఉన్నందున భూసేకరణ వ్యయం కూడా ఇక్కడ ఎక్కువే.   

వైఎస్సార్‌ జిల్లాలో 7,284 ప్లాట్లతో ఒకే కాలనీ  
► వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 7,284 మందికి నివాస స్థలాలు ఇచ్చేందుకు లేఅవుట్‌ సిద్ధమవుతోంది.  
► ఇక్కడ 257.53 ఎకరాల్లో గృహాలు నిర్మించేందుకు రోడ్లు, పార్కులు, వాణిజ్య సముదాయం, సామాజిక అవసరాలు, మౌలిక సదుపాయాల కోసం స్థలాల్ని కేటాయించి మాస్టర్‌ ప్లాన్‌ తరహాలో జిల్లా అధికారులు ప్లాట్లు వేస్తున్నారు.  
► ఈ కాలనీ ప్రధాన రహదారి (30 మీటర్ల) 98.42 అడుగుల వెడల్పుతో ప్లాన్‌ చేశారు. కాలనీలో కొన్ని రోడ్లను 65.61 అడుగులు, మరికొన్ని రహదారులను 39.37 అడుగులు, కొన్ని అంతర్గత రహదారులను 30 అడుగుల వెడల్పుతో ప్లాన్‌ చేశారు. 
► కాలనీలో మొత్తం 33, 390 మీటర్ల పొడవున రహదారులు ప్లాన్‌ చేశారు.  

99 % భూసేకరణ పూర్తి 
► గత నెల 25 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 26,77,778 మందిని ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి అర్హులుగా ఎంపిక చేశారు. వలస వెళ్లడం, ఇతర కారణాలవల్ల ఎవరి పేరైనా లబ్ధిదారుల జాబితాలో లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 5వ తేదీ వరకూ ప్రభుత్వం తిరిగి గడువు ఇచ్చింది. 
► వీరి అర్జీలను పరిశీలించి రెండు మూడు రోజుల్లో వీరిలో అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చే కసరత్తు గ్రామ, వార్డు సచివాలయాల్లో సాగుతోంది. మొత్తంగా దాదాపు 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
► ఇళ్ల స్థల పట్టాల పంపిణీ కోసం 45,848.57 ఎకరాలు అవసరమని అధికారులు లెక్క కట్టారు. సంఖ్య పెరిగితే ఇది పెరిగే అవకాశం ఉంది. ఇందులో 26,366.57 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. మిగిలిన 19,482 ఎకరాల ప్రయివేటు భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే 99 శాతం భూసేకరణ పూర్తయింది. ఇందులో 3,816 ఎకరాలను విశాఖపట్నంలో భూ సమీకరణ కింద తీసుకున్నారు. 

సకల సౌకర్యాలతో వైఎస్సార్‌ జగనన్న కాలనీలు  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇవ్వాలనే ఉద్దేశంతో విస్తృత ప్రచారం కల్పించి మరోమారు దరఖాస్తులు సేకరించాం. వీరిలో అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తాం. కొత్తగా ఎంపికయ్యే వారి కోసం అదనపు భూమి సేకరణ, ఫ్లాటింగ్‌ కార్యక్రమాలు ఈ నెలాఖరుకు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.   
 – హరికిరణ్, కలెక్టర్, వైఎస్సార్‌ జిల్లా 

పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు 
ఇల్లులేని దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చేలా ఇప్పటికే 2.50 లక్షల మంది అర్హులను ఎంపిక చేశాం. సీఎం ఆదేశాల మేరకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించగా విశాఖ జిల్లాలో 50 వేల అర్జీలు వచ్చాయి. వీరిలో అర్హులందరినీ లబ్ధిదారులుగా చేర్చే కసరత్తు చేస్తున్నాం. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజి లాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఈ మేరకు స్థలాలు వదిలేసి లే అవుట్లు వేశాం. లాటరీ ద్వారా పారదర్శకంగా ప్లాట్లు కేటాయిస్తున్నాం.  
    – వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్, విశాఖ జిల్లా 

అప్పట్లో చెప్పులరిగేలా తిరిగినా రాలేదు
ఇళ్ల స్థలాల పంపిణీతో జగనన్న మాబోటి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మాబోటి పేదలు ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలం కోసం అర్జీలు ఇచ్చి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా స్థలం రాలేదు. ఇప్పుడు జగనన్న అందరికీ ఇస్తుంటే చంద్రబాబు చూడలేక అసూయతో ఏదేదో మాట్లాడుతున్నారు. మా జిల్లాలో ఇళ్ల స్థలాలు రాకుండా చేయడం కోసం కొందరిని కోర్టుకు పంపించారు.  
    – దొడ్డి వీర దుర్గ, వాకతిప్ప, తూర్పుగోదావరి జిల్లా 

జగన్‌ను ఎవరూ మరువరు 
అనేక సంక్షేమ పథకాల ద్వారా మాలాంటి పేదలను ఆదుకోవడమే కాకుండా సొంతింటి కల నెరవేర్చుతున్న జగన్‌ బాబును ఎన్నటికీ మరువబోం. ఆ బాబు దయతో సొంత గూడు వస్తుందన్న ధీమా ఉంది.     
– పైలా దేవి, కె.వెంకటాపురం, విశాఖపట్నం 

నాడు 25 లక్షలు.. నేడు 30 లక్షలు..
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు గృహాలు కట్టించే విషయంలో ప్రభుత్వ లక్ష్యం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తొలుత 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం జగన్‌ తొలి కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. ఆ తర్వాత ఆ సంఖ్య 26 లక్షలు, 27 లక్షలకు పెరిగింది. తాజాగా 30 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ తర్వాత బెడ్‌రూమ్, హాలు, కిచెన్, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు నిర్మించేలా ప్లాన్‌ రూపొందించారు.

కలలో కూడా ఊహించలేదు
ఒకేసారి అన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. పేదల కలలను జగనన్న సాకారం చేస్తుంటే చూడలేక తెలుగుదేశం వారు అసత్యాలతో అవాకులు, చెవాకులు పేలుతున్నారు. పేదలకు ఇంటి స్థలం, ఇల్లు రాకుండా చేయాలని చూస్తే చంద్రబాబుకు మాలాంటి లక్షలాది మంది ఉసురు తప్పకుండా తగులుతుంది. ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకోవాలి. 
– కింతల అమ్మాయమ్మ, చినమిల్లిపాడు, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement