
చోటా నేతా.. ఏంటా రోత?
► టీడీపీ యువనేత పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలంతాపసుపు మయం
► ప్రధాన రోడ్లతో పాటు సందు.. గొందుల్లోనూ విచ్చలవిడిగావెలిసిన ఫ్లెక్సీలు
► అన్ని చోట్లా పోలీసుల నిఘా నేత్రాలకు కట్టిన గంతలు
► మహానేత వైఎస్సార్ విగ్రహాన్నీ వదలని తమ్ముళ్లు
► శ్రుతిమించిన నేతల అడ్డగోలు వ్యవహారాలు
ఒంగోలు క్రైం : జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు హెచ్చుమీరుతున్నారుు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సామాన్యులకు చీదర పుట్టిస్తున్నారు. వర్ధంతికి.. జయంతికి తేడా లేకుండా ఫ్లెక్సీలు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ నాయకుల రాకకు, పార్టీ మీటంగ్‌లకు కాదేది అనర్హం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ చోటా నేత పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీల పేరుతో హల్‌చల్ చేస్తున్నారు. పుట్టిన రోజేమో శనివారం. దీనికి నాలుగు రోజుల ముందు నుంచే నగరంలోని ప్రధాన రహదారితో పాటు అన్ని కూడళ్లలో ఫ్లెక్సీలే...ఫ్లెక్సీలు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అయితే నిబంధనలను నిలువునా తుంగలో తొక్కి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంత అడ ్డగోలుగా ఏర్పాటు చేశారంటే నగరంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కళ్లకు సైతం గంతలు కట్టారు.
పోలీసులు ప్రకాశం భవనం ముందు రోడ్డుపై వీధి లైట్ల స్తంభానికి కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉన్నారు. అది కనిపించకుండా ఆ చోటా నాయకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నగరంలో నిత్యం ఏం జరుగుతుందో గమనించే పోలీసు కమాండ్ కంట్రోల్ అధికారులు, సిబ్బంది గమనించారో లేదో తెలియదు. సదరు నేత అధికార పార్టీకి చెందిన చోటా నాయకుడు కావడం.. అందునా ఒంగోలు ఎమ్మెల్యేకు వరుసకు సోదరుడు కావటంతో పోలీసులు మనకెందుకులే అనుకున్నారో ఏమో. నాలుగు రోజుల నుంచి ఫ్లెక్సీలు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు.
నేతల వెర్రివెతలపై ప్రజల ఆగ్రహం
ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లోని అవుట్ గేటు వద్ద మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఆనవాళ్లు కూడా కనపడకుండా సదరు నాయకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే వారి వెర్రివెతలు ఏ స్థారుులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నగరపాలక సంస్థ అధికారులు సైతం నోరు మెదపకపోవడం గమనార్హం. పోలీసులు, వివిధ శాఖల అధికారులు ఫ్లెక్సీల నియంత్రణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసు అధికారులు వెళ్లి సదరు చోటా నాయకునికి కేకు ముక్క నోట్లో పెట్టి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వస్తున్నారంటే వారేం చర్యలు తీసుకుంటారులే.. అని మరి కొందరు వ్యగ్యంగా అంటున్నారు. చివరకు ఆయన స్వగ్రామం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పటం, బందోబస్తు నిర్వహించటం నగర పోలీసులు బాధ్యతగా నిర్వహించడం విస్మయం కలిగించింది. ఎంత అధికార పార్టీ అయినా ఒక స్థాయి నాయకులకు అయితే సామాన్యుడైనా పోనీలే అనుకుంటాడు. ఏ స్థాయి నాయకుడని సదరు నేతకు పోలీసులు, అధికారులు సకల మర్యాదలు చేశారో ప్రజలకు అంతుపట్టడం లేదు.
‘కొండపి’నీ వదలని తమ్ముళ్లు
టీడీపీ నేతలు కొండపి నియోజకవర్గాన్నీ వదల్లేదు. టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, కొండపి, మర్రిపూడి మండలాల్లో కూడా ఫ్లెక్సీలు రోడ్డుకు అడ్డంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. ఆయూ మండలాల అధికారులు సైతం సదరు చోటా నేత వద్దకు వెళ్లి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. కొందరైతే ఏకంగా సాష్టాంగ నమస్కారం చేశారు.