ఏపీలో 94 శాతం పింఛన్ల పంపిణీ | YSR Pension Kanuka Distribution In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీ

Published Fri, May 1 2020 6:20 PM | Last Updated on Fri, May 1 2020 8:29 PM

YSR Pension Kanuka Distribution In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ సృష్టిస్తున్న ఆలజడిలోనూ ఏపీ ప్రభుత్వం పట్టుదలతో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రతినెలా ఒకటో తేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్ సొమ్మును వారి చేతికే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్ల వ్యవస్థ ఉద్యమ స్పూర్తితో నెరవేర్చింది. శుక్రవారం ఉదయం నుంచే వాలంటీర్లు తమకు కేటాయించిన యాబై ఇళ్ళ పరిధిలోని ‘వైఎస్సార్‌ పెన్షన్ కానుక’ లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారికి స్వయంగా పెన్షన్ సొమ్మును అందించారు. 
(ఏపీలో శరవేగంగా పింఛన్ల పంపిణీ)

53 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2, 37,615 మంది వాలంటీర్లు కష్టపడి పనిచేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి సెక్రటేరియట్ స్థాయి ఉన్నతాధికారుల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగుల వరకు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ఫ్) సిఇఓ పి.రాజాబాబు స్వయంగా పశ్చిమగోదావరి జిల్లా కలపర్రు గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉత్సాహపరుస్తూ, వాలంటీర్లకు స్పూర్తినిస్తూ వారు సైతం పెన్షన్లను పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 94 శాతం మందికి, అంటే దాదాపు 53, 01,212 మంది లబ్ధిదారులకు పెన్షన్ ను అందించారు.
(ప్రత్యేక రైళ్లు; మార్గదర్శకాలు ఇవే..) 

భౌతికదూరం పాటిస్తూ..
ముఖానికి మాస్క్ లు ధరించి, శానిటైజర్లను ఉపయోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కరోనా నియంత్రణ నిబంధనలు ఎక్కడా ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్-19 నివారణా చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయో మెట్రిక్ వేయకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా జియోట్యాగింగ్ తో కూడిన ఫోటోలను వాలంటీర్లు ఫోన్ లో అప్ లోడ్ చేస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు.

1421.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
మే నెలలో వైఎస్సార్‌ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం మొత్తం 1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రెండు రోజుల కిందటే కే ఈ మొతాన్ని పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ఫ్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేసింది. సచివాలయ కార్యదర్శుల నుంచి సొమ్మును వాలంటీర్లకు అందచేయడం ద్వారా, శుక్రవారం ఉదయం నుంచే నేరుగా పెన్షనర్ల చేతికి పింఛన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో వుండి పోయినట్లయితే, వారిని కూడా గుర్తించి, పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

సీఎం జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా..
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ రోగులకు డిబిటి విధానంలో శుక్రవారం పెన్షన్ సొమ్మును జమ చేశారు. ఎవరైనా మే నెల పెన్షన్ సొమ్మును అనివార్య కారణాల వల్ల అందుకోలేక పోతే, వారికి జూన్ నెలలో అందచేసే పెన్షన్ కు ఈ నెలది కూడా కలిపి అందిస్తామని సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు వెల్లడించారు.

ఒక్కరోజులో రూ.1300 కోట్లు పంపిణీ: మంత్రి పెద్దిరెడ్డి 
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున 53 లక్షలకు పైగా పెన్షన్ లబ్ధిదారులకు రూ.1300 కోట్లకు పైగా పెన్షన్ సొమ్మును వారికి నేరుగా అందించిన వాలంటీర్లను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, పెన్షన్ల పంపిణీని విజయవంతం చేయడంలో వాలంటీర్లు చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. గ్రామస్థాయిలో పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం జగన్‌ రూపకల్పన చేసిన సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీ నిదర్శనమని ఆయన కొనియాడారు.

జిల్లాల వారీగా పెన్షన్ల పంపిణీ..
వైఎస్ఆర్ కడప: 3,11,214

చిత్తూరు : 4,62,235

విజయనగరం: 3,01,800

ప.గో.జిల్లా : 4,38,496

విశాఖపట్నం: 4,09, 170

శ్రీకాకుళం : 3,39,498

అనంతపురం: 4,73,717

తూ.గో.జిల్లా: 5,76,488

 నెల్లూరు : 3,16,935

కర్నూలు : 3,88,725

కృష్ణా: 4,42,987

ప్రకాశం : 3,57,739

గుంటూరు: 4,82,208

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement