
జనం కోసం అలుపెరగని కదనం
రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి ఈ ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైనా, అసెంబ్లీలోనూ అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.
* మహాధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ
* రైతుల్ని ముంచి, మహిళల కంట నీరొలికించారని ‘బాబు’పై ధ్వజం
కాకినాడ/మండపేట : రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి ఈ ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైనా, అసెంబ్లీలోనూ అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. రైతులను, మహిళలను దగా చేశామన్న ఆనందంతోనే టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో శుక్రవారం కాకినాడలో కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో జ్యోతుల మాట్లాడుతూ తొలి విడతలో రూ.14,492 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం ఇప్పుడు కేవలం రూ.5,000 కోట్లు మాత్రమే కేటాయించడంలో ఆంతర్యమేమిటన్నారు. మిగిలిన నిధులు ఎక్కడ నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేదంటూనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులను నిలువునా ముంచి, ఆడపడుచులతో కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
రైతుల్ని మభ్యపెడుతున్న చంద్రబాబు
కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ గతంలోనే రూ.ఐదు వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి ఇప్పుడు అదే మాటను చెప్పడం ద్వారా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తానని గొప్పగా ప్రకటించిన జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ రైతులకు, మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఏమయ్యారని నిలదీశారు. సీఎం చంద్రబాబు రైతులకు లెక్కలు రావన్న భ్రమలో ఉన్నారని రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు విమర్శించారు. రూ.ఐదు వేల కోట్లు ఎందరు రైతులకు సరిపెడతారని ప్రశ్నించారు.
రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుకు, మంత్రులకు మధ్య సమన్వయం లేదని, పొంతన లేని ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల రాజుబాబు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రుణమాఫీకి అరకొర కేటాయింపులతో చంద్రబాబు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నాలో ప్రత్తిపాడు, కొత్తపేట, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, కార్యక్రమ జిల్లా సమన్వయకర్త గొల్ల బాబూరావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, పార్టీ రాష్ర్ట కార్యదర్శులు కొల్లి నిర్మలకుమారి, సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని.
కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాజమండ్రి కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, నయీమ్, మార్గాని గంగాధర్, అనంత ఉదయభాస్కర్, డాక్టర్ యనమదల గీతామురళీకృష్ణ, మట్టపర్తి మురళీకృష్ణ, మంతెన రవిరాజు, అమలాపురం పట్టణ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి అల్లి రాజబాబు, జిల్లా వక్ఫ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు జమీల్, పార్టీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాలరావు, నక్కా రాజబాబు, పెంకే వెంకట్రావు, వట్టికూటి సూర్యచంద్రరాజశేఖర్, మాకినీడి గాంధీ, చెల్లుబోయిన శ్రీనివాస్, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, కాలే రాజబాబు, గొల్లపల్లి డేవిడ్‌రాజు, వర్మ, అత్తిలి సీతారామస్వామి, సత్తి వీర్రెడ్డి, సిరిపురపు శ్రీనివాసరావు, పెట్టా శ్రీనివాస్, కుసనం దొరబాబు, గోలి దొరబాబు, ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు.