సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం అత్యంత శాంతియుతంగా ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో మహాధర్నా నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు నిర్బంధకాండను ప్రయోగించారు. తమ ఆందోళనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా పార్లమెంటుకు బయలుదేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా నేతలను తరలిస్తున్న పోలీసులను అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించడంతో కొంతసేపు సంసద్‌మార్గ్‌లో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసి.. వాహనంలో పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అత్యంత శాంతియుతంగా ప్రత్యేక హోదా కోసం ఆందోళన నిర్వహిస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాజీనామాలకు సిద్ధపడ్డామని, అలాంటిది అరెస్టులకు భయపడతామా? అని ఎంపీలు ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకు తాము ఢిల్లీకి వచ్చామని, అరెస్టులు, ఆంక్షలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు.
తమ నేతల అరెస్టుపై వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు భగ్గుమన్నారు. ‘ఢిల్లీ పెద్దలను ఎదిరించడం మాకు కొత్త కాదు. గతంలో చాలాసార్లు మేం ఢిల్లీ పెద్దలను ఎదిరించాం, గతంలో ఏం చేసిందో, ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలి’ అని వైఎస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ‘టీడీపీ-బీజేపీ కుట్రలతో ఏపీకి అన్యాయం జరుగుతోంది. అరెస్టులకు మేం భయపడం. మరింత ఉధృతంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం’ అని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, విశ్వరూప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment