వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలో బాణ సంచా పేల్చుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
వైఎస్సార్ జిల్లా నుంచి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో హర్షాతిరేకం వ్యక్తమైంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004లో పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎం పీఠాన్ని అధిరోహించిన వైఎస్సార్ 2009లోనూ అదే రీతిలో పట్టాభిషిక్తులయ్యారు. వైఎస్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గురువారం ముఖ్యమంత్రి కావడంతో జిల్లా ప్రజానీకంలో పట్టరాని సంతోషం కలుగుతోంది. తండ్రి మాదిరిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాను మరోమారు దేశపటంలో నిలిపారని గర్వపడుతున్నారు. జిల్లాను ప్రగతిపథంలో పయనింపజేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తారని బలంగావిశ్వసిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి కడప: ఢిల్లీకి రాజయినా తల్లికి బిడ్డే అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలోనూ ఈనానుడ్ని జిల్లాప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రానికి సారథి అయినా తమ జిల్లాకు మాత్రం ముద్దుబిడ్డేనంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు తమ జిల్లాలోని పులివెందులకు ఎమ్మెల్యేనని వ్యాఖ్యానిస్తున్నారు. కష్టనష్టాలలో తోడుగా ఉంటూ ఆశీర్వదించిన తమ పట్ల కూడా ఆయన అదే తరహాలో ప్రేమ కురిపిస్తారని భావిస్తున్నారు. ఈసందర్భంగా ఆయనలోని పోరాటపటిమను..నాయకుడిగా ఎదిగిన తీరుపై చర్చించుకుంటున్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. తమ జిల్లాకు చెందిన నాయకుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మురిసిపోయారు. ప్రమాణ స్వీకార ఘట్టం జరుగుతున్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయంటే ఆ కుటుంబంపై జిల్లా ప్రజానీకం చూపిస్తున్న ఆదరాభిమానాలను అర్ధం చేసుకోవచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా చూసేందుకు బుధవారం సాయంత్రమే వైఎస్సార్‌సీపీ నాయకులు..కార్యకర్తలు..అభిమానులు విజయవాడకు తరలివెళ్లారు.
ఎదురొడ్డి నిలిచిన నాయకుడు
తన తండ్రి వైఎస్సార్ అకాల మరణం తర్వాత సుమారు పదేళ్లపాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం అఖండ మెజారిటీ కట్టబెట్టారు. 2009లో కడప ఎంపీగా 1,78,846 ఓట్ల మెజారిటీ సాధించారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,671ఓట్ల రికార్డు ఆధిక్యత సాధించి అబ్బురపరిచా రు. అప్పట్లోనే దేశం యావత్తూ కడప వైపు చూసేలా చేశారు. 2104లో వైఎస్ జగన్ పులివెందుల నుంచి 75243 ఓట్లతో మరో మారు రికార్డు సృష్టించారు. ఈదఫా తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ(90110ఓట్లు) తెచ్చుకుని ఔరా అనిపించుకున్నారు. ఇదీ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపిన అపారమైన ప్రేమకు తార్కాణం. అందుకే ఆయన తరచూ జిల్లాను మదిలో స్మరించుకుంటారు. ‘ఈ పులివెందుల నాకెన్నో పాఠాలు నేర్పింది. కష్టాలకు ఎదురొడ్డే శక్తిని ఇచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సడలని ధైర్యాన్ని నూరిపోసింది. ఈ గడ్డకు రుణపడి ఉంటాను’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో ఇటీవల ఎన్నికల్లో నామినేషన్ వేశాక జరిగిన సభలో భావోద్వేగానికి గురయ్యారు. అందుకే ఊపిరి సలపని ఒత్తిళ్లలోనూ ..తక్కువ సమయ వ్యవధి ఉందని గుర్తించినా ప్రమాణ స్వీకారానికి ముందు జిల్లాను సందర్శించారు.బుధవారం ఆయన జిల్లాలో పర్యటనకు రావ డం ఇక్కడి ప్రజలను కూడా ఆశ్చర్యానందాల్లో ముంచింది. రాయచోటి ప్రాంతానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుం జయరెడ్డిని తన పాలన మార్కు టీంలోకి తీసుకోవడమే జిల్లాపై ఆయన చూపించే మక్కువకు ఉదాహరణ అని అధికారులంటున్నారు.
నాన్న చూపిన ప్రగతి బాట
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే ఆయన తనయుడు కూడా నడుచుకుంటున్నారని జిల్లా ప్రజలంటున్నారు. ప్రమాణ స్వీకార వేదికపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవ్వాతాతలకు పించను పెంచుతూ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసిస్తున్నారు. గ్రామ సచివాలయాలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలనే సాహసోపేత నిర్ణయం ముమూర్తులా రాజశేఖరుడి స్ఫూర్తిని తలపింపజేసిందని సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగానే జిల్లాభివృద్ధి పరుగులు పెట్టింది. సమగ్రాభివృద్ధి దిశగా పయనించింది. అదే చొరవ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా చూపిస్తారని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతిని గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోగానే ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి. 2022 నాటికి ఈ పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. బుడ్డ శనగలు (బెంగాల్ గ్రామ్)కు గిట్టుబాటు ధరపై కొత్త సీఎం ప్రత్యేక చొరవ చూపనున్నారు. రూ.6,500తో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇదివరకే ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వమున్న జగన్ ఈదిశగా కసరత్తు చేపట్టనున్నట్లు భోగట్టా. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ప్యాకేజీ మార్చేందుకు సన్నహాలు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ పనులపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిసారిస్తారని జిల్లా వాసులు ప్రగాఢంగా నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment