వంచనపై గర్జించిన గుంటూరు | YSRCP And Students Vanchana Garjana In Guntur | Sakshi
Sakshi News home page

వంచనపై గర్జించిన గుంటూరు

Published Fri, Aug 10 2018 1:31 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

YSRCP And Students Vanchana Garjana In Guntur - Sakshi

వంచనపై గర్జన సభలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు

గుంటూరు గర్జించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా హోదాపై హామీ ఇచ్చి విస్మరించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తూర్పారబట్టింది. గుండెగుండెలో ఎగసిపడుతున్న హోదా ఆకాంక్షను ఢిల్లీ పాలకులకు కనబడేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోని వీఏఆర్‌ మైదానంలో ఉప్పెనై ఎగసింది. ప్రాణాలను ఫణంగా పెట్టి నిరవధిక దీక్ష బూనిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే హోదా సాధ్యమని చాటిచెప్పింది. ఐదు కోట్ల ఆంధ్రుల బంగారు భవిష్యత్‌ ముడిపడిన హోదా సాధన కోసం తమ పదవులకు తృణప్రాయంగా రాజీనామా చేసిన పార్లమెంట్‌ సభ్యుల త్యాగాన్ని కొనియాడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోని వీఏఆర్‌ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన ‘వంచనపై గర్జన’ దీక్ష సభకు అశేష జనవాహిని తరలివచ్చింది. సూర్యోదయంతోనే ఇన్నర్‌ రింగ్‌రోడ్డుపై మొదలైన జనప్రవాహం భానుడితో పోటీపడి అంతకంతకూ పెరుగుతూ జన ఏరుగా మారింది. అందరి అడుగులు వైదికవైపు జన ఉప్పెనలా సాగాయి. ఉదయం 9 గంటలకే తరలి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో దీక్షా స్థలి జనసంద్రంగా మారింది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. సభ ప్రారంభానికి ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం జరిపిన పోరాటాలను, చేసిన ప్రసంగాలను వేదికపై ప్రదర్శించారు.

సమరోత్సాహం నింపిన గర్జన
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకట రమణ అధ్యక్షతన వంచనపై గర్జన సభ జరిగింది. తొలుత దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ముఖ్యనాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రావి వెంకటరమణ, ఇతర నాయకులు పూలమాలుల వేసి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. రావి వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగట్టారు. ఉదయం పది నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 40 మందికిపై పార్టీ ముఖ్య నేతలు ప్రసంగించారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వారు తమ ప్రసంగాల్లో చాటిచెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హోదా సాధన కోసం పడుతున్న కష్టాన్ని, గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను వివరించారు. నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా వంచనతో సాగిందని పార్టీనేతలు ఉదాహరణలతో వివరిం చారు. చంద్రబాబు గోత్రం మోసమని, ప్రత్యేక హోదాపై ఆయన చేసిన వంచన, దగాకు నిరసనగానే వంచనపై గర్జన చేపట్టామని వివరించారు. 

దోపిడీని ఎండగట్టిన నేతలు
జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు మట్టి, ఇసుక, తెల్లరాయి దోపిడీలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో ఎండగట్టారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. నాగార్జున సాగర్‌ కుడికాలువ పరిధిలో పంటలు ఎండి రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, టీడీపీ నాయకులు వివిధ రూపాల్లో కోట్ల రూపాయలు దండుకుంటున్న వైనాన్ని వివరించారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ వ్యవహా రాన్ని ఎండగట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మాచర్ల ఎమ్మెల్యే, పార్టీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని చక్కదిద్దేం దుకే మంత్రి లోకేష్‌ పల్నాడులో పర్యటించారని దుయ్యబ ట్టారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పాపంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింలపై చూపుతున్న వివక్షను ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా వివరించారు. వైఎస్సార్‌ సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, పార్టీ ముఖ్య నేతలు ప్రసంగించారు.

దీక్షకు తరలి వచ్చిన నాయకులు
సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బూడి ముత్యాలనాయుడు, కె.సంజీవయ్య, కళతూరు నారాయణస్వామి, కోరుముట్ల శ్రీనివాసులు, ఆదిమూలపు సురేష్, గౌరు చరిత రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సంకె వెంకటరెడ్డి, మేకా ప్రతాప అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పీఏసీ మెంబర్‌ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మేరుగ నాగార్జున, జంగా కృష్ణమూర్తి, పూనూరి గౌతంరెడ్డి, షేక్‌ సలాంబాబు, చిల్లపల్లి మోహన్‌రావు, విజయవాడ పార్లమెంట్‌ సమన్వయకర్త షేక్‌ ఇక్బాల్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, జోగి రమేష్, గుం టూరు, నరసరావుపేట పార్టమెంటరీ జిల్లాల అధ్యక్షులు రావి వెంకటరమణ, అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, గుంటూరు అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహర్‌నాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనీక్రిస్టీనా, మర్రి రాజశేఖర్, కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, కార్యదర్శులు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), లక్కాకుల థామస్‌నాయుడు, ఎండీ నసీర్‌అహ్మద్, ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, నిమ్మకా యల రాజనారాయణయాదవ్, మిట్టపల్లి రమేష్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్‌ గులాంరసూల్, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి, యెనుముల మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు, రామిరెడ్డి, పలు విభా గాల నేతలు పాదర్తి రమేష్‌గాంధీ, దొంతిరెడ్డి వేమారెడ్డి,  అంగడి శ్రీనివాసరావు, అత్తోట జోసఫ్, తనుబుద్ధి కృష్ణారెడ్డి, యేళ్ల జయలక్ష్మి, బూరెల దుర్గ, పానుగంటి చైతన్య, బం డారు సాయిబాబు, షేక్‌ జిలాని, సయ్యద్‌ మాబు, ఆళ్ల పూర్ణచంద్రరావు, సఫాయితుల్లా, మెట్టు వెంకటప్పారెడ్డి, జగన్‌ కోటి, పరసా కృష్ణారావు, పసుపులేటి రమణ, మాదిరెడ్డి శ్రీని వాసరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, వాకా శ్రీనివాసరెడ్డి, గనిక ఝాన్సీరాణి, షేక్‌ గౌస్, సోమి కమల్, షేక్‌ సుభాని, షేక్‌ రబ్బాని, మండేపూడి పురుషోత్తం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ కృషిచేశారు.

మాజీ ఎంపీలనుసన్మానించిన న్యాయవాదులు
ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులను తృణప్రాయంగా త్యజించిన మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిని గుంటూరు జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు శాలువాలు కప్పి సన్మానించారు.

వైఎస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా
ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించారు. హోదాతో ప్రయోజనం లేదు ప్యాకేజీ ముద్దు అంటూ ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలను చంద్రబాబు నట్టేట ముంచారు. ప్రత్యేక హోదాతో పారిశ్రామికాభివృద్ధి, మరెన్నో ఇతర ప్రయోజనాలు ఉంటాయని గుర్తించిన మా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ ప్యాకేజీ వద్ద హోదా కావాలంటూ పోరాడారు. ఆయనతోనే హోదా సాధ్యమవుతుంది. వైఎస్సార్‌ సీపీని దెబ్బతీయాలని సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చేయి కలిపి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించారు. కోడెల కుటుంబ సభ్యుల దోపిడీతో ప్రజలు అల్లాడిపోతున్నారు.–డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే

మిన్నంటిన నినాదాలు
గుంటూరు: నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో జరిగిన ‘వంచనపై గర్జన’ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు రోశయ్య ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, కాకాని రోడ్డు మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోని వీఏఆర్‌ గార్డెన్స్‌లోని దీక్షా స్థలికి చేరుకుంది. తూర్పు నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, నాయకులు ప్రత్యేకహోదా జగన్‌తోనే సాధ్యం అంటూ మిన్నంటేలా నినాదాలు చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు వాకా శ్రీనివాసరెడ్డి, గనిక ఝాన్సీరాణి, కీసర వెంకటసుబ్బారెడ్డి, పల్ల శ్రీను, వాసిరెడ్డి విజయామాధవి పాల్గొన్నారు.   

టీడీపీ నేతల అక్రమార్జనను కక్కిస్తాం
రైతులు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు.  రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేకహోదా కావాలంటూ వైఎస్‌ జగన్‌ గుంటూరు వేదికగా అమరణదీక్ష సహా అనేక సందర్భాల్లో ఆందోళనలు చేవారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీ సభ్యుల వరకు మైనింగ్, మట్టి, ఇసుక, పింఛను ఇలా అన్నింట్లో రాష్ట్రాన్ని దోచేశారు. పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అతని పార్టనర్‌ మంత్రి నారా లోకేష్‌ కలిసి రూ.300 కోట్ల వరకు మైనింగ్‌ దోపిడీ చేశారన్న ఆరోపణలతో హైకోర్టు విచారణకు ఆదేశించింది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించి ప్రతి పైసా కక్కిస్తాం.      – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,వైఎస్సార్‌ సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే

గర్జన మోదీకి వినిపించాలి
వంచనపై గర్జన ప్రధాని మోదీకి వినిపించాలి. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ, హోదా 15 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు ప్రకటించి తెలుగు ప్రజలను వంచించారు. తిరుపతి ఎన్నికల సభలో వారిద్దరు హోదాపై హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారు. ముఖ్యమంత్రి రోజూ లక్షల కోట్లు ప్రజాధనం దోచుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినా ఆ తీర్మానాలను కేంద్రానికి పంపించకుండా చంద్రబాబు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్‌లు చేస్తున్న వారిపై చంద్రబాబు కేసులు పెట్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవులను హోదా కోసం త్యాగం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రాణాలు సైతం ఫణంగా పెడుతున్నారు. ప్రజలు మోదీకి, చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు.
– ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే

ఓటుకు రూ.10 వేలు ఇస్తామంటారు
టీడీపీ ఎప్పుడో ఓటమిని పసిగట్టింది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో భయపడుతున్నారు. అందుకే నేరుగా గెలవలేమని భావించి ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు 40 వేల ఓట్లు తొలగిస్తున్నారు. దీనిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పాలకులు దారుణంగా కాలరాయాలని చూస్తున్నారు. ఓటుకు రూ.10 వేలు ఇస్తామని కూడా టీడీపీ నాయకులు ఆశపెడతారు. ఈసారి ప్రజలు మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. వారంతా ఓటుతో కసి తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.– మొహమ్మద్‌ ముస్తఫా,గుంటూరు తూర్పు ఎమ్మెల్యే 

దొడ్డిదారిలో ఓట్ల తొలగింపు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదని గుర్తించిన సీఎం చంద్రబాబు దొడ్డిదారిలో ఓట్ల తొలగింపునకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను తొలగింపజేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు పైకి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో డ్వాక్రా మహిళలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నాలుగేళ్లగా ఎన్నో ఆందోళనలు చేస్తోంది. – కోన రఘుపతి, బాపట్ల ఎమ్మెల్యే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement