సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో ఏ చట్టసభలైనా అధికార, ప్రతిపక్షాలతోనే సమావేశాలు జరుగుతాయి. అయితే రాష్ట్రంలో అధికార పక్షం అసాధారణ పరిస్థితులను కల్పించింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది. తాజాగా మరో మహిళా ఎమ్మెల్యేను కూడా ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ నలుగురికి ఏకంగా మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సమావేశాలను ప్రతిపక్ష పార్టీ బహిష్కరించటం తెలిసిందే.
విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోటీడీపీ ఇన్‌చార్జ్‌లకు నిధులు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పలుసార్లు విజ్ఞప్తి చేసినా సభాపతి నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీలో రికార్డుల్లో మాత్రం నలుగురు మంత్రులతో పాటు ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికైనట్లు చూపిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పరిస్థితుల్లో మరో మార్గంలేనందున మిగతా సభకు హాజరు కారాదని ప్రతిపక్షం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సభాపతి దృష్టికి కూడా తెచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే సభకు హాజరవుతామని కూడా విపక్షం స్పష్టం చేసింది. ఇలాంటప్పుడు అధికార పార్టీ తప్పులను సరిచేసుకుని ప్రతిపక్షం సభకు హాజరయ్యేలా చూడకుండా వారు రాకపోయినా ఫరవాలేదనే రీతిలో వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి పసుపు కండువాలు కప్పడం ఒక ఎత్తయితే... విలువలకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులను కేటాయించకుండా టీడీపీ ఇన్‌ఛార్జుల పేరిట ఇస్తూ పాలకపక్షం అప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
సమావేశాలు అంటే సర్కారుకు భయం...
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. తెలంగాణ సర్కారు శీతాకాల అసెంబ్లీ సమావేశాలను యాభై రోజుల పాటు నిర్వహించేందుకు కూడా సిద్ధపడింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాధ్యమైనన్ని తక్కువ రోజులు సభ జరిపేందుకు మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రధాన సమస్య పరిష్కారం కాకపోవడం, అన్నివర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో వైఫల్యంతో పాటు ప్రజారోగ్యం, సంక్షేమం, అభివృద్ధి పనులు మందగించడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మొహం చాటేస్తోంది. వర్షాకాల సమావేశాలను నిర్వహించకుండా దాటవేసింది.
అది ఉప్పూ కారం లేని వంటకమే!
రాజ్యాంగపరంగా ఆరు నెలల్లోగా సభ నిర్వహించాల్సి ఉన్నందున అధికార పక్షం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహిస్తోంది. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10.30 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సుమారు పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం సమావేశాలు ముగిసిన తరువాత సభా వ్యవహారాల కమిటీ సమావేశమై ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏ సమస్యలపై చర్చించాలో నిర్ణయిస్తుంది. ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహణపై ప్రభుత్వం నాలుగు రోజులుగా కసరత్తు చేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమాలోచనలు చేశారు. అయితే ప్రధాన ప్రతిపక్షం లేని సమావేశాలు ఉప్పు కారం లేని వంటల మాదిరిగా ఉంటాయని, సమావేశాలకు ఎటువంటి ప్రాధాన్యం, సీరియస్‌నెస్ ఉండవని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రశ్న, జవాబు మనవే..
గతంలో ఏదైనా అంశంపై నిరసనగా ప్రధాన ప్రతిపక్షం ఎక్కువ రోజుల పాటు సభకు దూరంగా ఉంటే ప్రభుత్వంతో పాటు సభాపతి కూడా వారితో చర్చించి సభకు రప్పించేందుకు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సమావేశాలు నిర్వహించడం హుందాతనం కాదనే ఉద్దేశంతో సామరస్యంగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ‘మనమే ప్రశ్నలు వేసి మనమే సమాధానాలు చెప్పుకుందాం’ అనే రీతిలో వ్యవహరించడం గమనార్హం.
ఇలా ఎన్నడూ జరగలేదు: నాదెండ్ల మనోహర్, మాజీ స్పీకర్
ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలా జరగడం సరికాదు. ప్రజల సమస్యలపై చర్చలకు, పరిష్కారానికి అసెంబ్లీ అత్యున్నత వేదిక. అలాంటి సభలో ప్రతిపక్షం లేకపోతే సంపూర్ణత చేకూరదు. సభ సజావుగా నడిచేందుకు ప్రతిపక్షం, అధికారపక్షం పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా సభను సమర్థంగా నడిపించుకోవాల్సిన బాధ్యత అధికారపక్షంపై ఉంటుంది. గతంలో ప్రతిపక్షంలో రెండు మూడు పార్టీల సభ్యులుండేవారు. ఏదైనా సమస్య తలెత్తి ప్రతిపక్షం సభనుంచి బయటకు వెళ్లిపోవడమో సస్పెండ్ కావడమో జరిగితే మరో ప్రతిపక్ష పార్టీ ఆ అంశం సర్దుబాటు అయ్యేలా ప్రయత్నించేది. సమస్యను సభ దృష్టికి తెచ్చి బయటకు వెళ్లిన సభ్యులు తిరిగి సభాకార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేది. ఇతర పార్టీలు అధికార పక్షంపై ఒత్తిడి తెచ్చి సభ సాగేలా చూసేవి. ఇప్పటి సభలో ప్రధాన ప్రతిపక్షం ఒక్కటే ఉండటంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రజాసమస్యల ప్రస్తావన, పరిష్కారంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎంత కీలకమో సభను సజావుగా నిర్వహించటంలో అధికార పక్షానికి మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ దిశగా రెండు పక్షాలు నడుచుకోవాలి.
స్పీకర్ నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచమని ఎక్కడా చెప్పలేదు
ఇలాంటి విషమ పరిస్థితి, రాజ్యాంగ తూట్లు పొడిచే వ్యవహారాలు గతంలో చోటు చేసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రలోభాలు పెట్టి విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. సహజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. దీనిపై ఫిర్యాదు చేసినా, ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఖాతరు చేయకుండా సంవత్సరాల తరబడి నాన్చుతున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన మాట వాస్తవం. తీర్పు ఇచ్చే వరకు స్పీకర్ నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు.
నిబంధనలను వక్రీకరిస్తున్న యనమల
పార్లమెంటరీ నిబంధనావళి సెక్షన్ 42 ప్రకారం ఆ సెషన్ వరకే సస్పెండ్ చేయాల్సి ఉన్నా నిబంధనలను ఉల్లంఘించి విపక్ష ఎమ్మెల్యే రోజాను అధికారపక్షం ఏడాది పాటు సస్పెండ్ చేయించింది. అది అక్రమమని కోర్టుకు వెళ్తే సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్పీకర్ తన చర్యను సమర్థించుకున్నారు. ఇప్పుడు కోర్టులో కేసు ఉందంటూ అడ్డు పడుతున్నారు. ఫిరాయింపులపై ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగానే గవర్నర్ వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతికి కూడా విన్నవించాం. మా సభ్యులతో మాపైనే ఆరోపణలు చేయిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వైస్సార్ సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మంత్రులుగా అసెంబ్లీలో సమాధానాలు చెబుతున్నారు.
అసెంబ్లీ బులెటిన్‌లో వారిని వైఎస్సార్ సీపీ సభ్యులుగా చూపిస్తూనే మంత్రులుగా పేర్కొంటున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జరుగుతున్న ఇలాంటి సభను వైఎస్సార్ సీపీ బహిష్కరించడమే సరైనది. సభకు రాకుంటే సభ్యత్వాలు రద్దు అవుతాయని మంత్రి యనమల రామకృష్ణుడు బెదిరించడం సరికాదు. ఆయన తాను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. అసెంబ్లీ రూల్సును వక్రీకరిస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం సభను ఏడాది మొత్తంమీద 55 రోజులకు మించి నిర్వహించడం లేదు.
– ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ
విపక్షం లేకుండా సభ
Published Fri, Nov 10 2017 1:49 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment