- పూర్తయిన మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
- 12,677 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
- ‘మ్యాజిక్ ఫిగర్’ దాటాలంటే మరో 14,173 ఓట్లు అవసరం
- రెండు, మూడో స్థానాల్లో కేజే రెడ్డి, గేయానంద్
- కొనసాగుతున్న ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
- నేడు తుది ఫలితం వెలువడే అవకాశం
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, విజయానికి అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ గోపాల్‌రెడ్డికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతలో కేజే రెడ్డి, పీడీఎఫ్ అభ్యర్థి గేయానంద్‌కు పోలైన ఓట్లు, ‘మ్యాజిక్ ఫిగర్’కు అవసరమయ్యే ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గోపాల్‌రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు వాకిట నిలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతోంది.
ప్రతి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి మెజారిటీ
ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో 1,55,711 ఓట్లు పోలయ్యాయి. వీటిని సగటున 26 వేల ఓట్ల చొప్పున విభజించి ఆరు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొదటి రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకూ ప్రతి రౌండ్‌లోనూ గోపాల్‌రెడ్డికి ఆధిక్యత లభించింది. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. కేజే రెడ్డికి 41,037, గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. మిగిలిన అభ్యర్థులు స్వల్ప ఓట్లు సాధించారు.
మ్యాజిక్ ఫిగర్‌కు 14,173 ఓట్ల దూరంలో...
పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ.. అంటే 67,887 ఓట్లను ‘మ్యాజిక్ ఫిగర్’గా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్‌రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. అలాగే కేజే రెడ్డి 26,850, గేయానంద్ 35,077 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు గోపాల్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవ్వాలంటే మరో 10 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం తుదిఫలితం వెలువడనుంది.
విజయం ముంగిట గోపాల్‌రెడ్డి
Published Tue, Mar 21 2017 10:18 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement