‘సీమ’ మండలి పోరులో వైఎస్సార్‌సీపీ విజయం
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో గెలుపొందిన గోపాల్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నెల 20న కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ గోపాల్‌రెడ్డి మెజారిటీ సాధించారు. ఆ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. తద్వారా సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే, విజయానికి అవసరమయ్యే ‘మ్యాజిక్ ఫిగర్’ 67,887గా ఉండడంతో మంగళవారం రాత్రి నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.
ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటే వరకూ 22 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. గోపాల్‌రెడ్డి విజయానికి అవసరమైన ఓట్లు 67,887. మ్యాజిక్ ఫిగర్ కంటే 223 ఓట్లు ఎక్కువ పోలవ్వడంతో గోపాల్‌రెడ్డి గెలుపును అధికారులు ఖరారు చేశారు. కాగా ఈ ఎన్నికలను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నామనీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనై నమ్మకం ఉంచి బి–ఫారం ఇచ్చినప్పుడే తన గెలుపు ఖరారైందని ఎమ్మెల్సీ ఎన్నికైన వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. కాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ గెలుపొందారు.