
భూమా బ్రహ్మానందరెడ్డిపై వైఎస్‌ఆర్ సీపీ ఫిర్యాదు
నంద్యాల: నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. భూమా బ్రహ్మానందరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయపన్ను (ఐటీ) రిటర్న్స్ సమర్పించలేదని వైఎస్‌ఆర్ సీపీ నేతలు సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
భూమా బ్రహ్మానందరెడ్డి తనది హిందు అవిభాజ్య కుటుంబమని తన నామినేషన్‌లో పేర్కొన్నారని, అయితే భూమా కుటుంబం హిందు అవిభాజ్యమైతే గతంలో అఖిలప్రియ నామినేషన్‌లో ఎందుకు పేర్కొనలేదని వైఎస్‌ఆర్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని, ఆదాయ, వ్యయ వివరాలు వెల్లడించనందుకు ఆ నామినేషన్ తిరస్కరించాలని కోరారు. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో అభ్యంతరాలను ముందుకు తీసుకురాగా.. ఇతర అభ్యర్థుల నామినేషన్ల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.
ఇటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌పై టీడీపీ అభ్యంతరం లేవనెత్తింది. శిల్పా నామినేషన్ పేపర్లను అటెస్ట్ చేసిన నంద్యాలకు చెందిన నోటరీ రామతులసీ రెడ్డి..తన నోటరీని రెన్యువల్ చేసుకోలేదంటూ టీడీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత జిల్లా రిజిస్ట్రార్‌ను సంప్రదించిన టీడీపీ.. రామ తులసీరెడ్డి తన నోటరీని 2013 నుంచి రెన్యువల్ చేసుకోలేదని తెలిపింది.
అయితే నోటరీ రెన్యువల్ అన్నది చాలా చిన్న విషయమని, అఫిడవిట్ లోపం కింద దీన్ని పరిగణించబోరని న్యాయకోవిదులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఏ విషయమైనా వెల్లడించకపోయినా.. లేక అసత్యాలు ప్రకటిస్తేనే అది నామినేషన్ లోపం కిందికి వస్తుంది కానీ.. నోటరీ రెన్యువల్‌ను పరిగణనలోకి తీసుకోకపోవచ్చని పేర్కొన్నారు.
కాగా టీడీపీ యధేచ్ఛగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఎన్నికల కోడ్‌కు ఉల్లంఘిస్తూ నిన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు పొన్నాపురం కాలనీ కోదండ రామాలయం ప్రాంగణంలో టీడీపీ బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు.