
‘తెలుగుదేశం పార్టీకి అంత దమ్ము లేదు’
శ్రీకాకుళం : రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసన సభ సమావేశాలు తుతూమంత్రంగా జరపడం సరికాదని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల ఆవేదనను వినపించడానికి వేదికైన శాసనసభను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
పక్క రాష్ట్రాలు అయిన ఒడిశాలో 85 రోజులు, తెలంగాణలో 75 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఏపీలో మాత్రం ఎందుకు అన్నిరోజులు నడపలేకపోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేకే నామినేషన్లు వేసినవారిని బెదిరిస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి 20మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు ఇస్తామనడం అవమానకరమని ఆయన అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక్క ఎన్నిక కూడా జరపలేక అధికార పార్టీ భయపడుతోందని, ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము టీడీపీకి లేదన్నారు.