సాయిరెడ్డి మృతదేహంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్‌కుమార్, పార్టీ నాయకులు,
కృష్ణాజిల్లా, కంచికచర్ల (నందిగామ) : టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ కళాశాలలు, స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న స్కూల్స్‌ను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కంచికచర్లలో మంగళవారం శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న శీలం నాగార్జున సాయిరెడ్డి (14) ఆతహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్, స్కూల్ డీన్, లెక్కల టీచర్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షలు, స్కూల్ యాజమాన్యం రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ముందుగా సబ్ కలెక్టర్ మీషాసింగ్, నందిగామ ఇన్‌చార్జి డీఎస్పీ హరి రాజేంద్రబాబు, సీఐ కే సతీష్, ఇన్‌చార్జి తహసీల్థార్ రామకృష్ణతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
కాగా, మృతి చెందిన విద్యార్థి నాగార్జున సాయిరెడ్డి తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మంగమ్మలను డాక్టర్ అరుణ్‌కుమార్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు రాయల నరసింహారావు, వేల్పుల శ్రీనివాసరావు మాగంటి వెంకటరామారావు (అబ్బాయి), కాలవ వెంకటేశ్వరరావు, మన్నం శ్రీనివాసరావు, మార్త శ్రీనివాసరావు, బొల్లినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
స్కూల్‌ను సీజ్ చేసిన డీవైఈఓ
డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మీ ఆదేశాల మేరకు స్కూల్‌ను డీవైఈఓ చంద్రకళ సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థి నాగార్జున సాయిరెడ్డి ఇబ్రహీంపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుతున్నాడని, అతనితో పాటు మరో 26 మంది పేర్లు కూడా అక్కడ నమోదయ్యాయని చెప్పారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి కంచికచర్లలోని శ్రీ చైతన్య స్కూల్‌లో చదివిస్తుండటంతో పాఠశాలను సీజ్ చేస్తున్నామన్నారు. 7వ తరగతికి మాత్రమే అనుమతులు ఇచ్చామని, అయితే 8, 9 తరగతులు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులను ఇతర ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కడుపు కోత మిగిలింది..
కృష్ణాజిల్లా, కంచికచర్ల : ‘మాకున్న ఒక్కగానొక్క కొడుకు పెద్ద చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడని కూలీ నాలీ చేసుకుంటూ చదివిస్తున్నాం. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మేం మా కొడుకును కోల్పోయాం. చదువులమ్మ తల్లి మాకు కడుపు కోతను మిగిల్చింది..’ అని సాయిరెడ్డి తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మంగమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతికి స్కూల్ ప్రిన్సిపల్ దుగ్గిరాల ప్రసాద్, స్కూల్ డీన్, మరో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. రోజూ స్కూల్‌కు వెళ్లి బస్సులో ఇంటికి వచ్చేవాడన్నారు. అటువంటి తమ బిడ్డను స్కూల్ టీచర్లు అన్యాయం చేశారన్నారు. అనేకసార్లు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది తమ ఇంటికి వచ్చి వత్తిడి చేస్తేనే చేర్పించామని చెప్పారు. ఫీజ్ ఒక్క పైసా కూడా తగ్గించలేమన్నారని, దీంతో రూ.40 వేలు ముందుగానే చెల్లించామని తండ్రి తిరుపతిరెడ్డి బోరున విలపించారు. కొడుకును పెద్ద చదువులు చదివిద్దామని కూడా మద్యాన్ని కూడా మానేశానని చెప్పారు. తమ కుటుంబ వంశోద్ధారకుడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని విద్యార్థి నాయనమ్మ బోరున విలపించింది.
స్కూల్ గుర్తింపు రద్దు
మచిలీపట్నం : కంచికచర్ల మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి విజయలక్ష్మి వెల్లడించారు. శ్రీచైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్. సాయిబాబా నాగిరెడ్డి అనే విద్యార్థి మంగళవారం తరగతులు జరుగుతున్న సమయంలోనే భవనంపై నుంచి కాలు జారి పడిపోవటంతో మృతి చెందాడు. విద్యార్థి మృతికి నిరసనగా బంధువులతో పాటు, వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీలు, విద్యార్థి సంఘాల వారు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఈవో విజయలక్ష్మి స్పందించారు. విద్యార్థుల రక్షణకు పాఠశాల యాజమాన్యం తగిన రక్షణ చర్యలు తీసుకోవటంలో విఫలమైనట్లుగా గుర్తించారు. ఈ మేరకు శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment