
సమైక్య తీర్మానాన్ని అనుమతించాలి
వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయాలని 77వ నిబంధన కింద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసును స్పీకర్ శాసనసభలో అనుమతించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. ఆ తీర్మానంపై చర్చ జరిగాక ఓటింగ్ నిర్వహించి, వచ్చే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసు నిబంధనలకు లోబడే ఉంది కనుక స్పీకర్ ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే నిబంధన కింద ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా తీర్మానానికి నోటీసు ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందని, అందువల్ల వారంతా తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసి సమైక్య తీర్మానం నెగ్గేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి కూడా అసెంబ్లీకి విభజన బిల్లును పంపుతూ విడివిడిగా ఎమ్మెల్యేల అభిప్రాయంతో పాటు శాసనసభ అభిప్రాయం కూడా తెలియజేయాలని లేఖ రాశారని తెలిపారు. ఇది పార్లమెంటులో పెట్టే బిల్లు కనుక విప్ జారీచేయడం అనేది ఉండదని, అందువల్ల ఎమ్మెల్యేలందరూ తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించాలన్నారు. రాజ్యాంగం, నిబంధనల ప్రకారం స్పీకర్ చిత్తశుద్ధితో ఎమ్మెల్యేల అభిప్రాయంతో పాటు శాసనసభ అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతికి పంపాలని మైసూరా సూచించారు. కేంద్రం వంకర టింకరగా అధికారాన్ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, అయితే స్పీకర్ మాత్రం సంప్రదాయాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది చరిత్రాత్మకమైన బిల్లు కాబట్టి తగిన సమయం ఇచ్చి ఎమ్మెల్యేలంతా అవగాహనతో చర్చించడానికి వీలుగా శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
అన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి...
‘‘రాష్ట్రపతి నుంచి గురువారం రాత్రి 7 గంటలకు యుద్ధ విమానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బిల్లు వస్తే, రాత్రికి రాత్రి నలుగురు శాఖాధిపతులు పరిశీలించి సంతకాలు చేయడం.. ముఖ్యమంత్రికి పంపడం.. ఆయన దానిని గవర్నర్‌కు పంపడం.. అక్కడి నుంచి మళ్లీ ముఖ్యమంత్రికి రావడం.. అలా తనకు వచ్చిన విభజన బిల్లును సీఎం కిరణ్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్‌కు పంపడం.. ఇవన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. సాధారణంగా ఈ తంతుకు కనీసం నాలుగైదు రోజులు పడుతుంది. అలాంటిది నిద్రపోయే సమయం మినహాయిస్తే పది గంటల్లోనే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అసెంబ్లీకి చేరింది. సమైక్యవాదం ముసుగులో ఉన్న కిరణ్ ఇలా ఎందుకు చేసినట్లు? ఓవైపు సమైక్యవాదినని చెబుతూ మరో వైపు ఇలా బిల్లుకు సహాయ సహకారాలు అందించడం ఏమిటి? అధిష్టానం చెప్పినందువల్లే కిరణ్ ఇలా చేస్తున్నారా? లేక దిగ్విజయ్ ఆయన మెడపై కత్తి పెట్టి ఇలా చేయించారా’’ అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లు తనకు వచ్చినపుడు దానిపై ఆయన రాసిన ‘నోట్ ఫైల్’ వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
పైకి సమైక్యవాదినని చెప్పుకుంటూ కిరణ్ ప్రజలను ఇలా మభ్యపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏదైనా అంశం కేంద్రం నుంచి వస్తే తొలుత సంబంధిత శాఖ కార్యదర్శికి, అక్కడి నుంచి మంత్రికి ఆ తర్వాత ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి చేరుతుందని.. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని విమర్శించారు. ‘‘కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన కార్యదర్శి స్థాయి అధికారి.. ప్రధాన కార్యదర్శికి, గవర్నర్‌కు ఇలా బిల్లు పంచుకుంటూ ఎలా వెళ్తారు? ఇదేమైనా పాలెగాళ్ల రాజ్యమా.. ఇంత అప్రజాస్వామికమా’’ అని ప్రశ్నించారు. సచివాలయం పనివేళలు సాయంత్రం 5 గంటలకే ముగిసినా ప్రధాన కార్యదర్శి ఆ తరువాత ఈ తంతు ఎలా నడుపుతారన్నారు. కేంద్రం ఒత్తిళ్లకు లొంగి ఇలా వ్యవహరించడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, సర్వీసు రూల్స్‌కు కూడా వ్యతిరేకమని తెలిపారు. కాగా, సొంతంగా ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేనందువల్లే టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని మైసూరా ఎద్దేవా చేశారు.