
సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తమ పోరాటం కొనసాతుందని అన్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ 2014 నుంచి పోరాటం చేస్తోందని, నోటీసులు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు మోసం వల్లనే ప్రత్యేక హోదా రాలేదని, తెలంగాణ ప్రజలు ఆయనకు దిమ్మతిరిగే జవాబిచ్చారని పేర్కొన్నారు. అదే రీతిలో ఏపీ ప్రజలు కూడా బుద్ధిచెబుతారని జోస్యం చెప్పారు.
చంద్రబాబు నీతులు చెప్పారు..
తెలంగాణ ప్రజలు చంద్రబాబు చెంప చెల్లుమనిపించారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేసి ఏపీ ప్రజలను మభ్యపెట్టాలని ఆయన ప్రయత్నించారని, కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధిచెప్పారని అన్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించాలని చంద్రబాబు నీతులు చెప్పారని ఆయన గుర్తుచేశారు.
గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసిన నేతలు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాగా మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌లతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, వర ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులు పాల్గొన్నారు.
రాజ్యసభలో ఆందోళన..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళకు దిగారు. హోదాను డిమాండ్‌చేస్తూ సభలో ప్లకార్డులు పట్టుకుని నిరసనకు వ్యక్తం చేశారు. దీంతో సభ మధ్యాహ్న రెండు గంటలకు వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment