
అన్నపూర్ణ.. కరువు పీడిత రాష్ట్రమైంది
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పాలనలో కరువు పీడిత రాష్ట్రంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నా టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, తక్షణమే ధాన్యానికి రూ.300 బోనస్ ప్రకటించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూటికి 93 మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని, ఎక్కువ మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారని సెస్ నివేదికలో వెల్లడైందని చెప్పారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే 30 శాతం అధిక రుణాలివ్వాలని సెస్ సూచించగా.. మరోవైపు ఎక్కువ రుణాలిస్తే బ్యాంకులపై ఏసీబీ రైడ్ చేయిస్తామని, బంగారం రుణాలివ్వొద్దని స్వయంగా ముఖ్యమంత్రే హెచ్చరించటం దారుణమన్నారు. బ్యాంకులు రుణాలివ్వనందువల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొనడాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంటే రాష్ట్రంలో తగ్గడం దౌర్భాగ్యమని నాగిరెడ్డి అన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీలో 43.86 లక్షల హైక్టార్లలో పంట సాగవుతుంటే, ఇప్పుడు 38.28 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులో ఉందన్నారు.