జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన గడపగడపకు వైఎస్సార్‌సీపీ
విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. జన బాహుళ్యంలోకి దూసుకెళుతున్న ‘గడప గడపకు వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమం మూడో రోజు జిల్లా అంతటా విజయవంతంగా సాగింది. పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి, వారి కష్ట సుఖాలు తెలుసుకొని మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. జగనన్న పాలన వస్తే సమస్యలు తీరుతాయని వివరిస్తున్నారు. సీతంపేట 35వ వార్డు ప్రశాంతినగర్, సంజీవయ్య కాలనీల్లో విశాఖ-ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్, నగర మహిళాధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ర్ట నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, సిటీ ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్‌అలీ పర్యటించారు.
తూర్పు నియోజక వర్గం పరిధి మూడోవార్డు ఇందిరానగర్‌లో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో పార్టీ తూర్పు కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు విశాఖ నగరం 21వ వార్డులో పాల్గొన్నారు. ఆనందపురం మండలం శొంఠ్యాంలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కర్రి సీతారామ్, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్ పాల్గొన్నారు.
అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. కె.కోటపాడు మండలంలోని లంకవానిపాలెం, పిండ్రంగి గ్రామాల్లో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. జీకే వీధి మండలం జర్రెలలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గిరిజనుల ఇళ్లకు వెళ్లారు. బాక్సైట్ ప్రతిపాదిత మండలాలైన ఈ ప్రాంతాల్లో గిరిజనులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. తమ ఉనికిని ఈ ప్రభుత్వం దెబ్బకొడుతోందని, అక్రమంగా బాక్సైట్ తవ్వేందుకు సిద్ధపడినపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని అన్నారు. చింతపల్లి, పాడేరు జెడ్పీటీసీలు కె.పద్మకుమారి, బి.నూకరత్నం, జీకే వీధి ఎంపీపీ బాలరాజు పాల్గొన్నారు.
అనకాపల్లి నియోజకవర్గం నర్శింగరావుపేట దుర్గాలాడ్జి వీధిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు నమోదు చేసుకున్నారు. పాయకరావుపేట మండలం రాజవరంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్తలు గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ పాల్గొన్నారు.