►హామీలు నెరవేర్చని బాబును అసహ్యించుకుంటున్న ప్రజలు
►ముఖ్యమంత్రిపై 420 కేసు నమోదు చేయాలి
►వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి
►జిల్లావ్యాప్తంగా పార్టీశ్రేణుల నిరసన ప్రదర్శనలు
►పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నా, సీఎంపై ఫిర్యాదులు
►కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంచకుడిగా మారి ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో గుప్పించిన హామీల్లో ఏ ఒక్కదానినీ అమలుచేయని సీఎంపై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణ మాఫీ మొదలు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వరకూ ఏ ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నా చేసి ఆయా పోలీసు స్టేషన్లలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల బైక్ ర్యాలీలు, విజయవాడలో పాదయాత్ర చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పెనమలూరులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పాల్గొని ప్రసంగించారు. పార్టీ నాయకులు ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు మండలాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, పెనమలూరు పోలీసుస్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతరం ప్రజలను మోసగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడిని అరెస్టు చేయాలని కోరుతూ పార్థసారథి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జిల్లా వ్యాప్తంగా నిరసన
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నేతృత్వం లో నిరసన ప్రదర్శన చేశారు. లెక్కకు మించి హామీలు ఇచ్చి ప్రజలు, రైతులు, మహిళలను మోసగించిన సీఎం చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని నాని విమర్శించారు. అనంతరం పోలీసుస్టేషన్‌లో సీఎంపై ఫిర్యాదు చేశారు. పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ మోసకారి బాబును అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు. నూజివీడులో ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌అప్పారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ పేరుతో నట్టేట ముంచి అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడయ్యాడని ధ్వజ మెత్తారు. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.
జగ్గయ్యపేటలో బైక్ ర్యాలీ
జగ్గయ్యపేటలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కూడలిలో మానవహారం నిర్మించి, పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఎంపై ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. మైలవరంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపి స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. గన్నవరంలో పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో సీఎంపై చీటింగ్ కేసు నమోదుచేయాలని ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో అవనిగడ్డ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వంతెన వెళ్లి సెంటర్‌లోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కైకలూరులో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రదర్శనగా తరలివెళ్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. పెడనలో పార్టీ సమన్వయకర్త పుప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రదర్శ నిర్వహించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.