వైఎస్సార్‌సీపీ సమైక్య సభకు సర్కారు అడ్డుపుల్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సమైక్య శంఖారావం’ పేరుతో ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతల సమస్య అంటూ కుంటి సాకులు చూపుతూ హైదరాబాద్‌లో సమైక్య సభకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఈ మేరకు శనివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందించారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఇచ్చిన ఆర్డర్ చూస్తే ఇది పోలీస్ ఆర్డరా లేక పొలిటికల్ (రాజకీయ) ఆర్డరా? అన్న సందేహం కలుగుతోందని పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ శక్తులకు ఇష్టం లేకపోతే ప్రజల హక్కులను హరిస్తారా? రాష్ట్రంలో ఏమైనా ఎమర్జెన్సీ విధించారా? లేక నియంతృత్వ పాలన సాగుతోందని భావించాలా? అని ఆయన ప్రశ్నలు సంధించారు.
సభకు అనుమతివ్వకపోడానికి ఇవా కారణాలు..?
‘‘ఈ రాష్ట్ర రాజధానిలో మా వాణిని వినిపించుకోవటానికి అనుమతివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడిగింది. పార్టీల అభిప్రాయాలను వినిపించుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. వ్యక్తి స్వేచ్ఛకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు చెబుతున్నాయి. మా అభిప్రాయాలతో విభేదించే వ్యక్తులు రాష్ట్ర రాజధానిలో సభ పెట్టుకోవద్దంటున్నారు కాబట్టి అనుమతిని నిరాకరిస్తున్నాం అంటే దీన్ని ప్రభుత్వ అసమర్థత అనాలా? లేక సమైక్యవాదులు ఇకపై ఇక్కడ నోరెత్తటానికి వీల్లేదనే నిరంకుశ ఆదేశంగా దీన్ని భావించాలా?’’ అని మైసూరా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను ప్రజాస్వామిక వాదులంతా ఒకసారి చూడాలని , ఇందులో ఉన్న ప్రతీ అంశం రాజకీయమేనని మైసూరా అన్నారు. ‘‘ఈనెల 19న హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నిస్తే.. 2013 జూలై 30న తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని, అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ నోట్ ఆమోదం పొందటాన్ని... ఆ తరువాత విజయనగరం జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగటాన్ని పోలీసులు ప్రస్తావించారు.
అసంబద్ధమైన కారణాలతో సభకు అనుమతి నిరాకరిస్తారా? రాష్ట్రం విడిపోతే తమ బతుకులు ఎమిటన్న ఆందోళనతో కోట్ల మంది రోడ్ల మీదికి వచ్చినా.. అక్కడ ఉద్యమం నడుస్తోందని గుర్తించడానికి కూడా ఇక్కడి పొలిటికల్ పోలీసులు సిద్ధంగా లేరని పోలీసుల జవాబులు చూస్తే అర్థం అవుతోంది. శాంతి భధ్రతల్ని పరిరక్షించాల్సిన పోలీసులే శాంతి భద్రతలను ఒక సమస్యగా చూపటం విడ్డూరంగా ఉంది’’ అని మైసూరా పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ తన విధానాన్ని మార్చుకోవడాన్ని తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు పడుతున్నారంటూ పోలీసులు జారీ చేసిన ఆదేశాల్లోని మూడో విషయమని మైసూరా తెలిపారు. వైఎస్సార్‌సీపీ విధానం మార్చుకుందంటూ వెస్ట్‌జోన్ డీసీపీ అంటున్నారంటే దీని వెనుక ఉన్నదంతా రాజకీయమేనని స్పష్టం అవుతోందన్నారు.
ఆగస్టు 11న నరేంద్ర మోడీ సభకు ఇదే ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న బీజేపీకి అనుమతి ఇస్తే హింస, విద్వేషాలు ఈ రాష్ట్రంలో పెరుగుతాయని పోలీసుల్ని నియంత్రిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అనిపించలేదా? అంటూ మైసూరా ప్రశ్నించారు. అలాగే, సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలకు, సెప్టెంబర్ 29న తెలంగాణ జేఏసీ సభల సమయంలో జరిగిన చెదురుమదురు సంఘటనల్ని అదుపు చేయటంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వాటిని సాకుగా చూపుతూ వైఎస్సార్‌సీపీ సభకు అనుమతి ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వార్థ రాజకీయంలో భాగమేనని స్పష్టం అవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎలాగైనా విభజించి తీరాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏజెంటుగా మారాడని మైసూరా దుయ్యబట్టారు. తెలంగాణ మద్దతుదార్లు ఈ సభను అడ్డుకునే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? అన్న సందేహం కలుగుతుందన్నారు. ఈ రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదులు సభ పెట్టుకోరాదన్నట్లుగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలతో.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉన్నట్టా? లేనట్టా? ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కును ప్రభుత్వం కాలరాసిందన్నారు.
సభతో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఢిల్లీ నేతలకు తెలుస్తుంది..
వైఎస్సార్‌సీపీ హైదరాబాద్‌లో సమైక్య సభ పెడితే ఆ ప్రభంజనం ఢిల్లీలో రాజకీయ పార్టీలకు తెలిసివస్తుందని మైసూరా రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినిపించే సమైక్యవాణి పార్లమెంటేరియన్లను ఆలోచింప జేస్తుందన్నారు. పార్టీ ఆవిర్భవించిన తరువాత గాంధేయమార్గంలో నడిచామే తప్ప ఎక్కడా ఏనాడూ తాము ఎలాంటి హింసనూ, విద్వేషాన్ని రగల్చలేదని తెలిపారు. హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ ప్రజాస్వామికంగా, శాంతియుతంగా నిర్వహించాలన్నది వైఎస్సార్‌సీపీ అభిప్రాయంగా చెప్పారు. ఇదంతా ఇష్టం లేకే.. దొంగ సమైక్య నాటకాలు ఆడటం, ఆడించటంలో సిద్ధహస్తుడైన సీఎం కిరణ్ వైఎస్సార్‌సీపీ సభకు అనుమతి ఇవ్వరాదన్న ఆదేశం వెనుక ఉన్నాడని భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల పొలిటికల్ ఆర్డర్‌ను న్యాయస్థానంలో సవాలు చేస్తామని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఉపయోగించుకుని సమైక్య శంఖారావాన్ని హైదరాబాద్‌లో ప్రశాంతంగా నిర్వహిస్తామని మైసూరా వెల్లడించారు.
రాష్ట్ర పరిరక్షణ వేదిక ఖండన
వైఎస్సార్‌సీపీ ఈ నెల 19న హైదరాబాద్‌లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతిని నిరాకరించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండించింది. ఇది అప్రజాస్వామిక చర్య అని వేదిక రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాది అయితే సభకు అనుమతిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అర్ధరాత్రి ప్రకటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సభకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చాలా రోజుల కిందటే పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించింది. అయితే, దానిపై పోలీసులు స్పందించకపోవడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై ఈ నెల 12 వ తేదీలోగా నిర్ణయం చెప్పాలని హైకోర్టు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. గడిచిన మూడు రోజులుగా స్పందించని పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టు గడువు ముగిసే 12 వ తేదీ రాత్రి.. సమైక్య శంఖారావం సభకు అనుమతించడం లేదని పేర్కొంటూ సమాచారం పంపింది. వైఎస్సార్ సీపీ సమైక్యం కోసం హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే అడ్డుకుంటామని కొందరు చేసిన ప్రకటనలు పత్రికల్లో వచ్చాయని, ఆ కారణంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున సభకు అనుమతి నిరాకరిస్తున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి వైఎస్సార్‌సీపీకి ఇచ్చిన పత్రంలో పేర్కొన్నారు. దానిని రాత్రి మీడియాకు విడుదల చేశారు.