వేసవి ఆరంభమైతే చాలు.. పల్నాడు ప్రాంతాన గుక్కెడు నీళ్లు లేక ఎండిన గొంతులో ఎక్కిళ్లు ఆగేవి కాదు. బోర్ల కోసం రాళ్లను తొలిచి వందల అడుగులు తవ్వినా పాతాళాన ఉన్న గంగమ్మకు పైకి వచ్చే దారి కనిపించేది కాదు. చుట్టాలు గుమ్మంలోకి వచ్చినా ఆప్యాయత పలకరింపులేగానీ, ఆనందంగా చెంబుడు నీళ్లిచ్చే భాగ్యం ఉండేది కాదు. వేసవిలో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితులు ఉన్నా గత పాలకులకు పట్టేది కాదు. అందుకే మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం వైపు నూతన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై సుజలం.. ప్రతి ఇంటా సుఫలం కావాలని నిర్ణయించింది. ప్రతి మనిషికీ రోజుకు వంద లీటర్ల నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోనుంది.
సాక్షి, అమరావతి : జిల్లాలో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి మనిషికీ 100 లీటర్ల నీరు ఇచ్చేలా సన్నాహాలు చేస్తోంది. జిల్లా రూరల్ పరిధిలో 32.25 లక్షల మంది, అర్బన్ పరిధిలో 12.75 లక్షల మంది ప్రజలకు నీటి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 9.55 లక్షల పశువులకు నీటి కొరత రాకుండా చేసేందుకు సిద్ధమైంది. దీనికి కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ల్లాలోని కొన్ని ప్రాంతాలకు వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించింది. టెండర్లు పిలిచినప్పటీకి పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం ఆ పనులను నిలిపివేశారు.
ఎన్నికలకు ముందే ప్రస్తుతం గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి జిల్లాకు తాగు నీరు అందించే ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందించి ప్రాజెక్టు రూపకల్పనకు ప్రాధానత్య ఇవ్వాలని కోరారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ, పెదకూరపాడు, తాడికొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, ఉండవల్లి శ్రీదేవిలు సమావేశంలో తాగునీటి సమస్యను ప్రస్తావించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలు కవరయ్యేలా శాశ్వత ప్రాతిపదికన తాగునీటి పథకానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందించారు.
పల్నాడులో తీవ్ర తరం..
జిల్లాలో ప్రధానంగా పల్నాడు ప్రాంతాన్ని తాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. వినుకొండ, చిలకలూరిపేట, రేపలె, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీలతోపాటు గురజాల, వెల్దుర్తి, బొల్లాపల్లి, ఈపూరు, తాడికొండ, ప్రత్తిపాడు, తుళ్లూరు ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసేందులకు కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలు ఇవే..
జిల్లాలోని 1773 గ్రామాలు, గుంటూరు కార్పొరేషన్‌తోపాటు 13 మున్సిపాలిటీలకు నీరిచ్చేలా అంచనాలు రూపొందించారు. ఇందుకోసం 7.75 టీఎంసీలు, అర్బన్ ప్రాంతంలో 1.88 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో తాజా ప్రతి మనిషికీ 100 లీటర్లు, పశుజాతికి 30 లీటర్లు నీరు ఇచ్చేలా ఆర్‌డబ్ల్య ఎస్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీంతోపాటు 10 శాతం పరిశ్రమలు, టూరిజానికి అదనంగా ఉండేలా చూస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల నియోజకవర్గాలకు, బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, నియోజక వర్గాలకు నీరందించనున్నారు.
పులిచింతల ప్రాజెక్టు నుంచి సత్తెనపల్లి, తాడికొండ, ప్రత్తిపాడు, ప్రకాశం బ్యారేచి నుంచి మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు. ఇందుకోసం రూ.6090 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు వాటర్ గ్రిడ్ రూపకల్పన చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం దీనిని పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment