‘దేశం’ మోసం | ysrcp hawa in mpp elections | Sakshi
Sakshi News home page

‘దేశం’ మోసం

Published Mon, Jul 14 2014 4:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

‘దేశం’ మోసం - Sakshi

‘దేశం’ మోసం

ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతం

మాడుగుల ఎంపీపీ ఎన్నికలో టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. పీఠాన్ని దక్కించుకోడానికి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులకు ప్రలోభాలకు గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీటీసీలను టీడీపీ కొనుగోలు చేసి తమ వైపునకు తిప్పుకుంది. ఇక్కడ 21 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్‌ఆర్‌సీపీ 12, టీడీపీ 8, కాంగ్రెస్ ఒకటి దక్కించుకున్నాయి.

వైఎస్సార్‌సీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ ఈ మండల అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోడానికి భారీగా డబ్బులు వెదజల్లింది. దీంతో చివరి నిమిషంలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ముగ్గురు ఆ పార్టీకి మద్దతు పలికారు. ఈమేరకు ఇరు పార్టీల వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు  నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఎంపీపీగా ఓండ్రు గంగమ్మ, ఉపాధ్యక్షుడిగా పెరుమాళ్ల వెంకటరావు ఎన్నికయ్యారు.
 
విశాఖ రూరల్:  జిల్లాలో వాయిదా పడిన నాలుగు మండలాల ఎంపీపీ ఎన్నికల్లో మూడిం టిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా వి.మాడుగుల మినహా చింతపల్లి, అరకు, డుంబ్రిగుడలలో విజయం సాధించింది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో కోరం లేక, కో-ఆప్షన్‌సభ్యుడి నామినేషన్ నిర్ణీత సమయంలో దాఖలు చేయకపోవడం,తదితర కారణాలతో నాలుగు మండలాల ఎంపీపీ ఎన్నికలు నిలిచిపోయాయి. ఎన్నికల కమి షన్ ఆదేశాల మేరకు ఆదివారం గట్టి పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించారు. తొలుత ఎంపీటీసీ సభ్యులతో రిటర్నింగ్ అధికారులు ప్రమాణస్వీకారం చేయించాక, కో-ఆప్షన్ సభ్యులను ఆయా మండలాల్లో ఎన్నుకున్నారు. అనం తం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు.
 
డుంబ్రిగుడలో ఏకపక్షం
డుంబ్రిగుడ ఎంపీపీ స్థానాన్ని వైఎస్‌ఆర్‌సీపీ దక్కించుకుంది. ఎంపీపీగా వంతల జమున, ఉపాధ్యక్షుడిగా పాపారావు ఎన్నికయ్యారు. మండలంలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ ఏడింట గెలుపొందింది. టీడీపీకి 3, స్వతంత్రలు నలుగురు విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌సీపీకి స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు మద్దతు పలికారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీకి ఎంపీపీ పదవి దక్కింది.
 
అరకులో ఒప్పందం
అరకు ఎంపీపీ పీఠం ఎన్నిక ఉత్కంఠకు దారితీసింది. ఇక్కడ 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్‌ఆర్‌సీపీ 8, టీడీపీ 8 స్థానాలను దక్కించుకున్నాయి. హంగ్ ఏర్పడడంతో టాస్ వేయాలని అధికారులు భావించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు ఇరుపార్టీల సభ్యులతో చర్చించి రెండున్నరేళ్లు చొప్పున ఎంపీపీ పీఠాన్ని పంచుకోవాలని ఒప్పందం కుదిర్చారు. తొలుత వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఎంపీపీగాను, తరువాత టీడీపీ అభ్యర్ధి పనిచేసేలా అంగీకారానికి వచ్చారు. దీంతో అరకులోయ ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ మాడగడ-2 ఎంపీటీసీ కార్తికో అరుణ కుమారి ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా టీడీపీకి చెందిన పెదలబుడు-వన్ ఎంపీటీసీ పి. అమ్మన్నను ఎన్నుకున్నారు.
 
చింతపల్లి వైఎస్‌ఆర్‌సీపీ సొంతం
చింతపల్లి ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ 11 స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ 5, టీడీపీ 2, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన తమ్మంగులఎంపీటీసీ వంతాల చిలకమ్మ మృతితో సభ్యుల సంఖ్య 19కి తగ్గింది. వైఎస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో ఎంపీపీగా కవడం మత్స్యమ్మ ఎన్నికయ్యారు. వైఎస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన కె.లక్ష్మిని సభ్యులు ఎన్నుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement