'అనంత'లో పోలీసుల అత్యుత్సాహం
Published Wed, Dec 14 2016 11:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
అనంతపురం:
అనంతపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇవాళ కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికను కవరరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 8 కిలో మీటర్ల ముందే సాక్షి వాహనాన్ని ఎలా ఆపుతారంటూ ఎస్పీ రాజశేఖర్ బాబును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిళ్ల పల్లి దగ్గర ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.
2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనగానపల్లి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ, ఐదు స్థానాలను టీడీపీ దక్కించుకున్నాయి. వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఇద్దరిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఎలక్కుంట్ల ఎంపీటీసీ సభ్యుడు బిల్లే రాజేంద్రను ఎంపీపీ చేశారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే బిల్లే రాజేంద్రను ఆ పదవిలో కొనసాగించడం ఇష్టంలేని పరిటాల వర్గీయులు ఇటీవల ఆయనపై ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా రాజీనామా చేయించారు.
తెరపైకి తమ సామాజిక వర్గానికి చెందిన ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు పద్మగీతను తీసుకొచ్చారు. బలహీన వర్గాలపై అణచివేతను నిరసిస్తూ రాజేంద్రతో పాటు వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, కనగానపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఏడుగురు ఎంపీటీసీలతో ముందంజలో ఉండగా, టీడీపీ నలుగురు ఎంపీటీసీలతో వెనకంజలో ఉంది.
Advertisement