
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులను ఆహ్వానించామని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ నెల 30 (గురువారం)న మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు 5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పలుచోట్ల వాహనాల దారిమళ్లింపు చేపట్టారు. ఈ వేడుకకు హాజరుకానున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ క్వానాయ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గం సిద్ధం చేస్తున్నారు.