సాక్షి, హైదరాబాద్, శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో అనారోగ్యానికి గురై ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయన కుప్పం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి నార్సింగిలోని స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చంద్రమౌళి కుమారుడు భరత్ తెలిపారు. చంద్రమౌళి సేవలను పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.
వివిధ శాఖల్లో సేవలు..
► చంద్రమౌళి 1977లో ఏపీపీఎస్సీ ద్వారా సహకార శాఖలో అధికారిగా నియమితులయ్యారు. వివిధ శాఖల్లో పీడీగా, డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారిగా పలు జిల్లాల్లో సేవలు అందించారు.
► 1990 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆయన విజయనగరం, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టరుగా, వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.
► డ్వాక్రా గ్రూపుల నిర్వహణ, ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన చర్యల్లో కీలకంగా వ్యవహరించారు. మహిళా స్వావలంబన, బాలల ఆరోగ్యంపై యూనిసెఫ్ కార్యక్రమ నిర్వాహకుడిగా ప్రశంసలు అందుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌గా, అపార్డ్ డైరెక్టర్‌గా ప్రత్యేకతను చాటుకున్నారు.
► ఉద్యోగ విరమణ అనంతరం వైఎస్సార్‌సీపీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీనిచ్చారు.
► కుప్పం మండలం పెద్దబంగారునత్తం చంద్రమౌళి కుటుంబం స్వగ్రామం. ఆరేళ్లుగా కుప్పంలో ఉంటున్నారు. ఆయనకు భార్య పద్మజ, కుమారులు భరత్, శరత్ ఉన్నారు.
సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కె.చంద్రమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కలెక్టర్‌గా, రాజకీయ నేతగా అందించిన సేవలను ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారన్నారు. చంద్రమౌళి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment