పత్తి పంట
సాక్షి, పుల్లలచెరువు (ప్రకాశం): రైతులను ఐదేళ్లుగా కరువు వెంటాడుతోంది. వేసిన పంట వేసినట్లే ఎండిపోతోంది. అయినా పంటలపై ఆశ చావని అన్నదాత అప్పోసోప్పో చేసి పంటల సాగు చేసి చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. అయితే విపత్తుల సమయంలో అన్నదాతకు ఆసరా లేకుండా పోతోంది. కరువు నేపథ్యంలో పండలు ఎండిపోతే వారిని ఆదుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకువచ్చింది. రైతు ఒక్క రూపాయి చెల్లించి పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వమే ప్రీమియం మొత్తం చెల్లించి రైతుకు సాగు చేసే పంటకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా చేపట్టిన ఈ కార్యక్రమం రైతులకు వరం లాంటిదని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.
80 వేల ఎకరాల్లో పంటల సాగు..
నియోజకవర్గంలోని పుల్లలచెరువు, త్రిపురాంతకం, వైపాలెం, దోర్నాలు, పెద్దారవీడు మండలలాల్లో దాదాపు 75 వేల మంది రైతులు 80వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. ఈ మండలాల్లో ప్రధానంగా పత్తి, మిరప, వరి ఇతర పంటలను సాగు చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు, ఇతరత్రా కారణాలతో రైతులు నష్టపోతుంటారు. ఈ నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు బీమా పథకాల ద్వారా ఆదుకుంటాయి. ఇటీవల ప్రభుత్వం రైతులు ఒక్క రూపాయ చెల్లిస్తే చాలు బీమా వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో ఉపయోగం..
రైతన్నల పంట నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టాయి. వీటి ద్వారా 2019–20 సంవత్సరానికి గాను పంటల బీమా నమోదు పక్రియను ప్రారంభించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులకు తమ ఖాతాల ద్వారా ఆయా బ్యాంకులు బీమా కంతు చెల్లిస్తాయి. బ్యాంకుల నుంచి అప్పు తీసుకోని రైతులు ఈ పథకంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. వాతావరణ ఆధారిత బీమా పథకం పత్తి, మిరప పంటలకు వర్తిస్తుంది. ఈ నెల 31 గడువు ముగియనుంది. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా పథకం కింద కంది, మినుము పంటలకు ఈ నెల 31తో, వరికి ఆగస్టు 31తో గడువు ముగుస్తుంది.
నమోదు చేసుకోవడం ఇలా..
రైతులు ఒక్క రూపాయ చెల్లించి సమీపంలోని మీసేవా, కంప్యూటర్ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు. రైతులు తప్పనిసరిగా వారి పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పాసుపుస్తకంల జిరాక్సులను తీసుకుని ఆయా కేంద్రాలకు వెళ్లి రైతులు ఫసల్ బీమా కోసం నమోదు చేసుకోవాలి.
ఒక్క రూపాయితో బీమా వర్తింపు
బీమా కంపెనీలకు అవసరమైన మొత్తంను చెల్లించేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చింది. రైతన్న ఎకరానికి ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు. వాతావరణ ఆధారిత బీమాలో పత్తి పంట సాగుచేస్తే ఎకరానికి రూ 1.600, మిర్చికి ఎకరానికి రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధమైంది. ఫసల్‌బీమాలో కంది పంటకు ఎకరానికి రూ.360, మినుముకు రూ.280, వరికి రూ.640లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని వ్యవసాయాదికారులు చెబుతున్నారు.
ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు..
రైతులు సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల్లో కొంత మేరకు నష్టపోతుంటారు.ఆ నష్టా నుంచి రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. వీటికి రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– జవహర్‌లాల్‌నాయక్, వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment