పల్లెబాటకు శ్రీకారం | YSRCP Launches State-Wide Rachabanda, Pallenidra | Sakshi
Sakshi News home page

పల్లెబాటకు శ్రీకారం

Published Sun, Nov 12 2017 11:19 AM | Last Updated on Fri, May 25 2018 9:25 PM

YSRCP Launches State-Wide Rachabanda, Pallenidra  - Sakshi

జనం దగ్గరికి వెళ్లి .. సమస్యలు తెలుసుకొని ప్రజా మెనిఫెస్టోను రూపొందిస్తానని వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో జిల్లాలో రచ్చబండ–పల్లె నిద్రలకు ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తొలుత రచ్చబండను ఏర్పాటు చేసి స్థానికుల కష్టనష్టాలను తెలుసుకున్న అనంతరం అక్కడే బసచేసి వారితో మమేకమయ్యారు. జగన్‌ సేనకు సమస్యలు స్వాగతం పలికాయి. 

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌ సీపీ మరో ప్రజా కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు వినూత్న ప్రయత్నం చేస్తోంది. ‘రచ్చబండ – పల్లె నిద్ర’ పేరుతో పార్టీ నేతలు శనివారం శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు తమవంతుగా క్షేత్రస్థాయిలో పర్యటనలకు సమాయత్తమయ్యారు.

ప్రజా సమస్యలే అజెండాగా మున్ముందుకు...
ప్రజల పక్షాన జిల్లాలో వైఎస్సార్‌ సీపీ నిరంతరం పోరాటం చేస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలపై ప్రజల తరఫున ఉద్యమించింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మొండి వైఖరిని అవలంబిస్తున్న సర్కార్‌ పెద్దల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అలుపెరగకుండా నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్న పార్టీగా చరిత్ర కెక్కింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎడతెరిపిలేకుండా ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారి కష్టనష్టాలను కళ్లారా చూసేందుకు ‘రచ్చబండ– పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సూక్ష్మ సమస్యలు సైతం గుర్తించి, అధినేత దృష్టికి తీసుకెళ్లి తగు పరిష్కారానికి కృషి చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రూపొందించనున్న మేనిఫెస్టోలో కూడా వీటిని ప్రస్తావంచనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందిస్తామని ఇప్పటికే అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ మార్గంలోనే  రచ్చబండ– పల్లెనిద్ర కార్యక్రమానికి జిల్లాలో నేతలు శ్రీకారం చుట్టారు. 

సందడిగా ప్రారంభం...
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడి హాజరవగా, అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కోడూరుపాడులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సమన్వయకర్త పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం పొట్టిలంకలో జరిగిన కార్యక్రమంలో సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, సమన్వయకర్త కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, అనపర్తి నియోజకవర్గ పరిధిలోని దుప్పలపూడిలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరిగిన కార్యక్రమంలో  సమన్వయకర్త బొంతు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశరావు,  రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కడియం మండలం మురమండ ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త ఆకుల వీర్రాజు, అదేæ నియోజకవర్గ పరిధిలోని ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో గిరిజాల వీర్రాజు (బాబు), పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో ఉలిమేశ్వరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త తోట సుబ్బారావునాయుడు,  ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరం ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త పితాని బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఉదయం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రాత్రి పల్లెనిద్ర చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement