
కుల వివక్షను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కుల వివక్షను పెంచి పోషిస్తున్నారని, రాజకీయ స్వార్థం కోసం దళితులపై దౌర్జన్యం, దాడులు చేయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో 75 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములను నీరు– చెట్టు పేరుతో కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు నాయకత్వంలో రెండు నెలల నుంచీ ఎక్కడెక్కడ అవకాశాలుంటే అక్కడ భూములు లాక్కుంటున్నారని, దేవరపల్లిలో చెరువుల వంకతో దళితుల భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. దేవరపల్లిలో తక్షణమే చెరువు తవ్వకాన్ని ఆపాలని బత్తుల డిమాండ్ చేశారు. లేదంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.