‘ఇదేదో చిన్న కేసేలే అని బాబు అనుకుంటున్నారు’
శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందన గౌరవంగా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. ప్రజాజీవితంలో ఉన్నవారిపై ఆరోపణలు రావడం సహజమే కానీ నిర్దోషిత్వం నిరూపించుకునే వరకూ పదవి నుంచి తప్పుకోవడం ప్రజాస్వామ్యంలో సంప్రదాయమని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కేసులో తన నిర్దోషిత్వం నిరూపితం అయ్యే వరకు తన పార్టీలో అందరూ కోరుకునే వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఆయన బుధవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును పరిశీలించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణకు అర్హమైనదిగా భావించిన తర్వాతే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఇదేదో సాధారణమైన, తీసి పారేసే విషయమైతే కాదన్నారు. ఇలాంటి ఫిర్యాదులు తననేమీ చేయవంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ధర్మాన తప్పుపట్టారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలించి, ఈ కేసును విచారణకు స్వీకరించిందంటేనే అదెంత తీవ్రమైన విషయమో తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసు విచారణలో ఉన్నప్పుడు నిందితులెవరైనా రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండడానికి అర్హులు కారని చెప్పారు.