
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): చంద్రబాబు ఊసరవెళ్లి అని, పూటకో రంగు మార్చడం ఆయనకే చెల్లు అని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే..నేడు చంద్రబాబు దాని మౌలిక సూత్రాలను సైతం కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టి తెలుగు వారి పరువు తీశారని విమర్శించారు. ఆయన శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాడు ఓటుకు నోటు కేసుతో భయపడిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారన్నారు. నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎక్కడ ముద్దాయిగా చేర్చుతారోనని అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లలో తను, తన కొడుకు లోకేష్ చేసిన అవినీతి అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నారని, బయటకు మాత్రం దేశ రక్షణ అంటూ మరోసారి ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని దుయ్యబట్టారు. ఆయన చెప్పే మాటలను వినే వారెవరూ ఏపీ, తెలంగాణల్లో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, టీడీపీకి డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని అన్నారు.
ఉరి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం విజ్ఞతకే...
కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే తాను ఉరి వేసుకుంటానని, ఆ పార్టీతో కలసి పనిచేసే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడీ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించారని, అయినా చంద్రబాబు ఏకపక్షంగా రాహుల్‌ను కలిశారని, కావున నిజమైన టీడీపీ నాయకులు ఆయన నిజ స్వరూపాన్ని గమనించాలని సూచించారు. ఎంతో సీనియర్ అయిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి లాంటి వారికే కనీస సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారంటే ఆ పార్టీలో ఎందుకు ఉండాలో వారే ఆలోచించుకోవాలన్నారు.
రాహుల్ తీరు సిగ్గుచేటు
రాహుల్‌గాంధీని పప్పుసుద్ద అన్న మొదటివ్యక్తి చంద్రబాబే అని, అలాగే సోనియాను ఇటలీ దెయ్యమని, గాడ్సే, అవినీతి అనకొండ అని విమర్శించిన తీరును రాహుల్‌గాంధీ గతం గతః అనుకోవడం సిగ్గుచేటని బీవై రామయ్య విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణ చూసి సీఎంకు భయం పట్టుకుందని, అందువల్లే స్వార్థం కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలుచేసిన కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ప్రజలెవరూ అంగీకరించరని, 2014లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీడీపీకి 2019లో పడుతుందని అన్నారు. ఆ పార్టీ దుకాణం బంద్ చేసుకొని చంద్రబాబు ఢిల్లీకి పారిపోతారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని రాజకీయాలు చేయడం ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. నమ్ముకున్న విలువలే ఆయన్ను 2019 ఎన్నికల్లో సీఎం కుర్చీపై కూర్చోబెడతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment