సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సుపరిపాలన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నాయకుడా, లేక తెలంగాణ ప్రతిపక్ష నాయకుడా అని ఎద్దేవా చేశారు. (‘మనవడితో ఆడుకోక.. ఈ చిటికెలెందుకు?’)
కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందిపడుతుంటే, చంద్రబాబు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో కరోనా కేసులు దాచవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కరోనా కేసులపై ఆదివారం పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. చంద్రబాబు రాష్ట్ర ఖజనా ఖాళీ చేసి ఆస్తులు విదేశాల్లో దాచుకున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంట్లో నుండి బయటకు వచ్చి మాట్లాడాలని, ముందు మీరు రాష్ట్రానికి వచ్చి ప్రజా సేవ చేయాలని సూచించారు.
సబ్బవరం మండలం మొగలిపురంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని.. త్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొగలిపురంలో గ్రామ వలంటీర్‌పై దాడికి పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనుచరులపై చర్యలు తప్పవన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment