
దౌర్జన్యాలను ఎండగడతాం..
అధికారపార్టీ అరాచకాలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
16న బెళుగుప్పలో ధర్నా
అనంతపురం : ప్రభుత్వాధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతపాలన కొనసాగిస్తూ.. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ఎండగడతామని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలకు నిరసనగా ఈ నెల 16న బెళుగుప్ప మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.
ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌కె రోజా, జిల్లా పరిశీలకులు, పర్యవేక్షకులు మిథూన్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరాం, తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. అధికారపార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వాధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సూరయ్య హత్య కేసు నుంచి శీనప్ప తప్పించుకోవడానికి సీబీఐతో విచారణ జరిపించారన్నారు. సూరయ్య భార్య ఓబులమ్మను అనేక ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా వారి ఆస్తులను కొల్లగొట్టేందుకు కట్రపన్నుతున్నారన్నారు. పయ్యావుల శీనప్ప నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలే తప్పా.. ఈ మహిళలను వేధించడం సరికాదన్నారు. అధికారం శాశ్వతమని భావించి రాజ్యాంగేతర శక్తులుగా టీడీపీ నాయకులు చేస్తున్నా దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, సానుభూతిపరులు హత్యలకు , దౌర్జన్యాలు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రెవెన్యూ అధికారులపై వరుస దాడులు జరుగుతున్నా విషయాన్ని ప్రభుత్వాధికారులు గమనించాలన్నారు. మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. కృష్ణవేణి, ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, అధికారప్రతినిధి సిపి వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు ఓబిలేసు పాల్గొన్నారు.