
కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తరలిపోతున్నాయంటూ అబద్ధపు కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్ చానల్, ఆ సంస్థ విలేకరిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో భద్రపరచిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తరలిపోతున్నాయంటూ ఏబీఎన్ చానల్‌లో ఈనెల 13న వచ్చిన కథనాన్ని వారు ఖండించారు. తప్పుడు సమాచారంతో వార్తను ప్రసారమయ్యేలా పనిచేసి జిల్లా ప్రజలు, అభ్యర్థుల ఆందోళనకు కారణమైన చానెల్, ఆ విలేకరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆ పార్టీ నాయకులు జిల్లా అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్‌లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్‌దాదా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని భద్రపరచిన యూనివర్శిటీ స్ట్రాంగ్ రూంలలోకి ఏబీఎన్ విలేకరి ప్రవేశించడంతో భద్రతా ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడిందన్నారు. ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను అంటూ సదరు విలేకరి దర్జాగా లోపలికి ప్రవేశించి రహస్యంగా వీడియోలు తీసి చానల్‌లో ప్రసారం చేయడం ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.
కాగా, ఈ కథనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా విషయాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్ మాట్లాడుతూ.. వాస్తవాలను ప్రసారం చేయాల్సిన చానళ్లు ఇలాంటి అసత్యపు కథనాలతో తమ రేటింగ్‌లను పెంచుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. అబద్ధపు ప్రసారంతో ప్రజాప్రతినిధులు, ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్ ఛానల్‌పై కలెక్టర్, ఎస్పీ తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment