సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేలా పోలీసు యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్పీ ఠాకూర్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు వాహనాల్లోనే డబ్బును నియోజకవర్గాలకు చేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని శ్రీనివాస్, యోగానంద్, విక్రాంత్ పాటిల్, కోయా ప్రవీణ్‌తో పాటు మరికొంత మంది ఐపీఎస్ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి కనుసన్నల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.(చదవండి : సీఈసీ ఆదేశాలు బేఖాతరు)
అదే విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవో అంశాన్ని కూడా వైఎస్సార్ సీపీ నేతలు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా పసుపు-కుంకుమ పథకం కింద నేరుగా మహిళ ఖాతాల్లో టీడీపీ డబ్బు జమ చేస్తున్న వైనంపై కూడా ఫిర్యాదు చేశారు. కాగా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు మంగళవారం జీవో (నంబర్ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నంబరు 720 జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment