వైఎస్సార్ సర్కిల్‌లో ధర్నా చేçస్తున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కురుబ మాలగుండ్ల శంకరనారాయణ, పార్టీ శ్రేణులు
అనంతపురం , పరిగి : ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి తన క్షేమాన్ని మాత్రమే చూసుకుంటూ స్వార్థ సారథిగా మారారని ఎమ్మెల్యే బీకే పార్థసారథిని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కురుబ మాలగుండ్ల శంకరనారాయణ ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా రిజర్వాయర్ నిండుతున్నా పెనుకొండ నియోజకవర్గంలో ఒక్క చెరువునూ పూర్తిస్థాయిలో నింపలేని అసమర్థ ఎమ్మెల్యే బీకే అని ధ్వజమెత్తారు. పొరుగు నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలు కృష్ణా జలాలతో చెరువులు నింపుకుంటుంటే పెనుకొండ ఎమ్మెల్యేకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఆయన చేతగాని తనానికి నిదర్శనమన్నారు. పరిగి మండల కేంద్రంలో సోమవారం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జయరాం నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమం జరిగింది.
తొలుత వైఎస్సార్ సర్కిల్‌లో ప్రధాన రహదారిపై దాదాపు గంట సేపు బైఠాయించారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీసం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించడం లేదని ఆరోపించారు. ఎన్నికలు నాలుగు నెలల్లో ఉండగా ఇప్పుడొచ్చి ఓటమి భయంతో పర్యటనలు చేయడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. దివంతగ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే గొల్లపల్లి రిజర్వాయరు పనులు జరిగాయని శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతరం తహసీల్దారు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ అంజనరెడ్డికి అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ, బీసీ సెల్ నాయకుడు డీవీ రమణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వరరావు, సేవాదళ్ నాయకుడు మారుతీరెడ్డి, కార్యకర్తలు, మండల వ్యాప్తంగా ఉన్న పలువురు రైతులు, పెనుకొండ, రొద్దం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment