పూతలపట్టు పోలీస్‌స్టేషన్ ముందు బైటాయించిన వైఎస్సార్ సీపీ నేతలు
తిరుపతి రూరల్: మీరు చిత్తూరులో రౌడీ కావచ్చు. మీకు శత్రువర్గం ఉండవచ్చు. హత్యలు చేసుకునేంత శత్రుత్వం ఉండవచ్చు. కానీ ప్రశాంత చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం రౌడీ రాజకీయం వద్దని వైఎస్సార్‌సీపీ నాయకులు హేమేంద్రకుమార్‌రెడ్డి, మస్తాన్, చెన్నకేశవరెడ్డి, బాబురెడ్డి, ఎంపీటీసీలు నాగరాజు, సీఎం కేశవులు కోరారు. చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన పుట్టా రవిపై పులివర్తి నాని అనుచరుల హత్యాయత్నంకు నిరసనగా బుధవారం దళితులు, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రగిరి క్లాక్ టవర్ సెంటర్‌లోనూ, పూతలపట్టు పోలీసు స్టేషన్ ఎదుట వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాస్తారోకో చేశారు.
దాడి చేసిన పులివర్తి నాని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో కులం, మతం, పార్టీ, రాజకీయం అంటూ శత్రుత్వాలు ఉండవన్నారు. ఇక్కడ ప్రజలు ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తారని, తర్వాత ఆప్యాయంగా ఉంటారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని చోట్టా అందరు నాయకులు పాల్గొంటారని తెలిపారు. మండల సమావేశాల్లో సైతం సమస్యలపైనే తప్ప పార్టీల జోలికి వెళ్లరని గుర్తు చేశారు. అలాంటి ప్రశాంత నియోజకవర్గంలో మీరు చేస్తున్న బెదిరింపులను ఆపాలని తెలిపారు. చేయిస్తున్న దాడులను అరికట్టాలని, దయచేసి ప్రజలను భయందోళనలకు గురిచేయవద్దని వేడుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఉదయం లేస్తే ఎవరి బతుకుదెరువు కోసం వారు వెళ్తారని, అలాంటి బడుగుజీవులను భయపెట్టవద్దన్నారు.
దళితుల జీవితాలతో ఆటలొద్దు
రాజకీయాల కోసం దళితుల జీవితాలతో ఆటలొద్దని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. దళితుడిపై హత్యాయత్నం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో దళితులపై ఇలాంటి భౌతిక దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు అందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి, పూతలపట్టు సీఐలకు వినతి పత్రాలు అందజేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు ఎమ్మెల్యేల పరామర్శ
తిరుపతి రూరల్: పులివర్తి నాని అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి మండలం మొరవపల్లి చెందిన పుట్టా రవిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణస్వామి, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. రవి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, యశ్వంత్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment