శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు ప్రజలు సిగ్గుపడేలా ఉందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్‌ను, ఈయన వెనుకున్న పాత్రదారులు, సూత్రధారులపై సీబీఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు చేసి నిజనిర్ధారణ తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతిలు మాట్లాడారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంటుందని.. అయితే జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను చూసిన తరువాత ఆ విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుడు శ్రీనివాస్.. జగన్ అభిమాని అని, ఎస్సీ కులానికి చెందిన వాడని, జగన్‌తో కలిసి ఫ్లెక్సీలు ఉన్నట్లు చిత్రీకరించడంతోపాటు.. వాటిని నేరుగాడీజీపీ చూపించారంటే అది కచ్చితంగా ముందస్తుగా ఇవన్నీ సిద్ధం చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని బీజేపీ, టీఆర్‌ఎస్, జనసేన పార్టీల నేతలు ఖండిస్తే .. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టడం చూస్తే టీడీపీ ప్రోద్బలంతోనే జగన్‌పై హత్యాయత్నం జరిగిందనే విషయం తేటతెల్లమవుతోందన్నారు. చంద్రబాబుకు మిత్ర పక్షంగా ఉన్న నాయకులైన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు జగన్‌ని పరామర్శిస్తే దాన్ని ఎందుకు కుట్రగా భావించలేదని ప్రశ్నించారు.
హత్యాయత్నాన్ని ఖండించని బాబు
ఏ పార్టీకి చెందిన నాయకుడిపైనైనా.. హత్యాయత్నం జరిగినా, దాడి జరిగినా, ఆరోగ్యం బాగోలేకపోయినా సానుభూతి చూపించి పరామర్శించడం సంప్రదాయమని, అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని రాజకీయ చేస్తూ మృగంలా వ్యవహరించడం దారుణమని సీతారాం మండిపడ్డారు. ఇదే చంద్రబాబుకి అలిపిరిలో ప్రమాదం జరిగితే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నీళ్లుపెట్టుకుని దాడి అమానుషమని ఖండించారని, అంతటితో ఆగకుండా ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి హైసెక్యూరిటీని చంద్రబాబుకు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరే ఇతర ప్రాంతంలోనైనా జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడితే ప్రజలు క్షమించరని పసిగట్టిన టీడీపీ నాయకులు ఎయిర్‌పోర్టుని ఎంపిక చేసుకున్నారన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వీఐపీ లాంజ్‌లో ఇంతటి దారుణానికి ఒడిగట్టారన్నారు. సీసీ కెమెరాలు ఉండాల్సి ఉండగా వాటన్నింటిని తీసేసి హత్యాయత్నం జరిగిన ఆధారాలను తుడిచేయాలని, దర్యాప్తులను నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడించాలని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా పోలీసులు..తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ను చంపేందుకు మ్యాప్‌గీసిన విషయం మల్లెల బాబ్జీకి తెలిసిపోయిందని.. దీంతో అతన్ని హత్యచేయించిన ఘనత బాబుదని ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్‌కు కూడా అలాంటి ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు.
గవర్నర్‌పై చిందులా?
శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే ఎవరినైనా ప్రశ్నించే హక్కు గవర్నర్‌కు ఉంటుందని.. దాని ఆధారంగానే జగన్‌పై హత్యాయత్నం జరిగినపుడు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను గవర్నర్ ప్రశ్నించారని.. అయితే చంద్రబాబు మాత్రం సీఎంగా తనను వివరాలు అడిగి తెలుసుకోవాలి తప్ప.. నేరుగా డీజీపీని అడిగే హక్కు లేదని చిందులేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులపై దాడులు, భవిష్యత్‌లో జరగబోయే సంఘటనలపై ప్రచారం చేసుకున్న గరుడ పురాణం మాస్టర్ శివాజీని అమెరికా ఎందుకు పంపించేశారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
పథకం ప్రకారమే జగన్‌పై హత్యాయత్నం: ధర్మాన కృష్ణదాస్
పథకం ప్రకారమే జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నం చేయించి దానితో కూడా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. హత్యాయత్నం విషయంలో సీఎం, డీజీపీ వ్యవహరించిన తీరు చూస్తుంటే పథకం ప్రకారమే అంతా జరుగుతోందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు తాపత్రయం పడుతున్నారు తప్పితే.. మానవతా దృక్పథం ఏ కోణంలోను కనిపించడం లేదన్నారు. పోలీసుల తీరు చూస్తుంటే ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారనే భావన తప్ప న్యాయ అన్యాయాలను పరిశీలనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదన్నారు.
బాబును క్షమించరు: రెడ్డి శాంతి
జగన్‌పై 5 కోట్ల ఆంధ్రులు చూపిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని చంద్రబాబు ఆయన్ని హత్య చేయించేందుకు పన్నాగం పట్టారని రెడ్డి శాంతి అన్నారు. ప్రధాన ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కోవర్టులు సభ్యత లేకుండా మాట్లాడుతున్న తీరు బాధకరమన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం విషయమై అజ్ఞానంలో ఉన్న మంత్రి లోకేష్ అవగాహన రాహిత్యంగా పిచ్చికూతలు కూస్తున్నారని..ఇతన్ని చికిత్స కోసం హాస్పటల్‌లో చేర్పించాల్సి ఉందన్నారు. అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్, పార్టీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, ప్రధాన కార్యదర్శి, హనుమంతు కిరణ్‌కుమార్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మార్పు ధర్మారావు, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా మంజుల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment