
మేమున్నాం
రాజధాని ప్రాంత రైతుల్లో ఆత్మస్థైర్యం నింపిన వైఎస్సార్ సీపీ కమిటీ
ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం,
లింగాయపాలెం గ్రామాల్లో పర్యటన
గుంటూరు సిటీ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచేసిన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటించింది. తొలుత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్వంలోని ఈ కమిటీ గుంటూరు నుంచి మధ్యాహ్నం బయలుదేరి నేరుగా ఉండవల్లి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపింది. రైతులు, కౌలు రైతులు, కూలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పోలీసులు గ్రామాల్లో తిరిగినా భయపడాల్సిన పని లేదని, ఎవరినైనా అక్రమంగా నిర్బంధించాలని చూస్తే కలసికట్టుగా ప్రతిఘటించాలని కమిటీ నేతలు సూచించారు. ఇప్పటికీ కొందరిలో భయం తొలగిపోలేదని, అందుకే వారు ఈ సమావేశానికి రాలేకపోయారని పలువురు రైతులు కమిటీ దృష్టికి తీసుకురావడంతో వైఎస్సార్ సీపీ నేతలు బయలుదేరి వారి ఇళ్లకు వెళ్లారు. పోలీసుల అక్రమ కేసులు, వేధింపుల కారణంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్న ఉద్దండ్రాయునిపాలెం రైతు నందిగం సురేష్ ఇంటికి వెళ్లి ఆయన్ను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
హక్కులు కాపాడుకునేందుకు పిరికితనాన్ని విడనాడి ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం లింగాయపాలెం వెళ్లి పోలీసుల నిర్బంధంలోనే ఉన్న శ్రీనాథ్ చౌదరి తండ్రి సుబ్బారావును పరామర్శించారు. త్వరలోనే శ్రీనాథ్‌చౌదరికి బెయిల్ వస్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి పార్థసారథి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, జలీల్‌ఖాన్, తాడికొండ ఇన్‌చార్జి కత్తెర క్రిస్టీనా తదితరులు ఉన్నారు.
వేధింపులు ఆపండి
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో అధికార పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, కొద్దిరోజుల కిందట జరిగిన దహనకాండకు సంబంధించి పోలీసులు విచారణ పేరుతో రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.