
డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది. బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చింది. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే న్యాయం చేస్తామని ప్రతిపక్ష నేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హామీనిచ్చారని.. బాధితులు ఎవరూ అధైర్యపడవద్దంటూ పిలుపునిచ్చింది. బాధితుల పక్షాన నిలవాల్సిన అధికార టీడీపీ.. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయడానికి చూస్తోందంటూ మండిపడింది. రానున్నది రాజన్న ప్రభుత్వమని, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తిన్నదంతా కక్కించి బాధితులకు పంచిపెడతామని స్పష్టం చేసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపిల్లి కృష్ణంరాజు ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టింది.
విశాఖపట్నం, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు చెల్లించాల్సిందిపోయి వాటిని దోచుకోవడానికి చంద్రబాబు అండ్ కో బృందం కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా.. 9 లక్షల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారం వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయాలని, బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపాలని తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రూ.1153 కోట్లు ఇచ్చి 80 శాతం మంది బాధితులకు న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మిగతా బాధితులకు కూడా రావల్సిన ప్రతి పైసా చెల్లిస్తామన్నారని చెప్పారు. బాధితులకు సంస్థ చెల్లించాల్సిన మొత్తం కన్నా సంస్థ ఆస్తులు అధికంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు బలి
పార్టీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఆయన తనయిడు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం.. సంస్థ ఆస్తులను కబ్జా చేసేందుకు పాకులాడుతోందని ఆరోపించారు. బాధితులు 90 రోజులు ఓపిక పడితే.. తమ ప్రభుత్వం రాగానే పూర్తిగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ బాధితులంతా ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు ప్రభుత్వం అంతిమయాత్రకు సిద్ధంగా ఉందని చెప్పారు. పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనే అగ్రిగోల్డ్ వ్యవహారం ఓ పెద్ద స్కామ్ అని విమర్శించారు. పేదలకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం వారి ఉసురు పోసుకుంటోందని ఆక్షేపించారు. పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్లు ఆస్తులున్నా.. బాధితులకు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పైడి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ బాధితులు ఎవరూ ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని, తమ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య చాలా పెద్దదని, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బుని టీడీపీ నాయకులు దోచుకోవాలనుకోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాదరెడ్డి, బొల్లవరపు జాన్‌వెస్లీ మాట్లాడుతూ టీడీపీ సర్కారు చాలా మంది అగ్రిగోల్డ్ బాధితుల్ని నడిరోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, సనపల చంద్రమౌళి, అదనపు కార్యదర్శి గుడిమెట్ల రవికుమార్(రవిరెడ్డి), మైనార్టీ విభాగం నాయకులు ఐహెచ్ ఫారూఖి, బర్కత్ ఆలీ, మహ్మద్ షరీఫ్, బీసీ సెల్ నాయకుడు కె.రామన్నపాత్రుడు, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు తుల్లి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నాయకులు రెయ్యి వెంకటరమణ, ప్రేమ్‌బాబు, మహిళా విభాగం నాయకులు పీలా వెంకటలక్ష్మి, శ్రీదేవివర్మ, రాష్ట్ర నాయకుడు ఆదివిష్ణు, పలు వార్డుల అధ్యక్షులు, నగర, జిల్లా, రాష్ట్ర నాయకులతో పాటు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నియోజకవర్గ కన్వీనర్లు మొల్లి అప్పారావు(తూర్పు), పీతల వాసు(దక్షిణ), పామేటి బాబ్జి(ఉత్తరం), పల్లా పెంటారావు(గాజువాక), కోరాడ ముసలినాయుడు(భీమిలి), దాడి సత్యనారాయణ(పశ్చిమ), బి.వెంకట్రావు(ఎస్.కోట), పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.
డీఆర్‌వోకు వినతి
వైఎస్సార్ సీపీ నాయకులు, బాధితులు ధర్నా అనంతరం కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ముందుగా యలమంచిలికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ తాతబాబు ఇటీవల గుండెనొప్పితో చనిపోవడంతో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తాతబాబు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రకరకాలుగా మోసం చేశారు..
నేను టీకొట్టు వ్యాపారిని. టీం లీడర్‌గా పనిచేశాను. నా కింద 45 మంది ఏజెంట్లు ఉన్నారు. డైరెక్టర్లు మమ్మల్ని రకరకాలుగా మోసం చేసి వ్యాపారం చేయించుకున్నారు. చివరికి నడిరోడ్డుపై పడేశారు.
– జి.అప్పారావు, అగ్రిగోల్డ్ బాధితుడు
వైఎస్సార్ సీపీపైనే ఆశలు
వైఎస్సార్ సీపీపైనే అగ్రిగోల్డ్ బాధితులంతా ఆశలు పెట్టుకున్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మా కష్టాలు, బాధలు తీరుస్తారన్న నమ్మకం ఉంది. తమకు న్యాయం చేస్తే జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. 2007లో అగ్రిగోల్డ్‌లో జాయిన్ అయ్యాను. 2014 వరకు టీమ్‌లు వేశాను. కంపెనీ మోసం చేసిందనుకుంటే.. వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మమ్మల్ని నాలుగేళ్లుగా మోసం చేసుకుంటూ వచ్చారు.– జి.లక్ష్మి, అగ్రిగోల్డ్ బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment