
బాబుతో సంతకం చేయిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, స్పీకర్‌కు అందజేసే అఫిడవిట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేత సంతకం చేయించగలరా? అని టీడీపీ నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి, సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అఫిడవిట్ల ఆలోచన మాదే అంటున్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ను ఒకటి సూటిగా అడుగుతున్నాం.
అఫిడవిట్లపై చంద్రబాబు చేత సంతకం చేయించగలరా? మేము మా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి వెళ్లి రాష్ట్రపతికి సమైక్యంగా ఉంచాలని విన్నవిస్తాం. మీరు చంద్రబాబు నేతృత్వంలో పార్టీ నేతలందరూ కలసి రాష్ట్రపతిని కోరగలరా?’ అని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన పట్ల రెండు కళ్లు, ఇద్దరు కొడుకులు, కొబ్బరిచిప్పల సిద్ధాంతాలంటూ విచిత్ర వైఖరి అవలంభిస్తున్న చంద్రబాబు.. తన చెంబుగ్యాంగ్ చేత రాజకీయ దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో చీర్‌గరల్స్, చింతామణి పాత్రలు ఎవరు పోషిస్తున్నారో రాష్ట్ర ప్రజానీకం గమనిస్తోందని పయ్యావుల కేశవ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఇరుప్రాంత నేతలు రక్తికట్టించిన డ్రామాలు, నటించిన పాత్రలు ప్రజలేం మరిచిపోలేదన్నారు. ప్రతీ ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకొని కండువాలు వేసుకుంటున్న చంద్రబాబు విశ్వసనీయత గలిగిన వ్యక్తి అంటూ కేశవ్ మాట్లాడటం చూస్తుంటే ‘జోక్ ఆఫ్ ది ఇయర్’గా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదని, ఓట్లు, సీట్లే తనకు ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారని, టీడీపీకి ఆ పేరు తీసేసి ‘వన్ బై టు పార్టీ’ అని నామకరణం చేసుకోవాలని సూచించారు.
వారి డ్రామాలకు మేం మద్దతివ్వం..
‘ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కడుతున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఎన్జీవోలు తమ జీతాలు వదులుకుని రాష్ట్రసమైక్యత కోసం ఉద్యమంలో పాల్గొన్నారు. సమైక్య ఉద్యమాన్ని నడిపించిన అశోక్‌బాబు.. ప్రతీ రాజకీయపార్టీ సమైక్యంవైపు రావాలని పార్టీల అధ్యక్షులను అడిగిఉంటే విభజన ఇంత దూరం వచ్చేదే కాదు. ఇప్పుడు అశోక్‌బాబు చేయాల్సింది.. సమావేశానికి పార్టీ ప్రతినిధులను కాకుండా అధ్యక్షులను రమ్మని పిలవాలి. అందుకు మా అధినేత జగన్ సిద్ధం’ అని శోభానాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
బాబూ.. లౌకిక వాదంపై నీ వైఖరేంటి?
వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమని తెలిసి దింపుడు కళ్లెం ఆశతో బీజేపీతో పొత్తుకోసం తహతహలాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు లౌకికవాదంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మీతో పొత్తు వద్దేవద్దని బీజేపీ నేతలు చీదరించుకుంటున్నా చంద్రబాబు మాత్రం నరేంద్ర మోడీ అంటూ జపం చేస్తూ ఆ పార్టీతో పొత్తు కోసం దేబిరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎద్దేవా చేసింది. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత ధర్మాన కృష్ణదాస్, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. చంద్రబాబుకు సొంతబలంపై నమ్మకం లేకనే నరేంద్ర మోడీ ఇమేజ్‌ని వాడుకుని ఎలాగోలా బయటపడొచ్చనే ఆశతో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు.
జగన్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారమిక్కడి పార్టీ కేంద్రకార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, యువత, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.