గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
అధికార, ప్రతిపక్ష వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం
గ్రామాల్లో పార్టీ పటిష్టానికి కృషిచేయాలని పిలుపు
జంట జిల్లాల నేతలతో సమీక్ష
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ నియోకజవర్గ సమన్వయకర్తలు, ముఖ్యనాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోకజవర్గం వారీగా పరిస్థితిని తెలుసుకుని ప్రజల్లో మమేకం అవుతూ, గత నాలుగేళ్లలో అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్య్టాలు ప్రజలకు వివరిస్తూ, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయా వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని, వారి తరఫున ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించాలన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకూ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారేనని అన్నారు. జల యజ్ఞం కింద పలు ప్రాజెక్టులకు ఈ ప్రాంతంలో అంకురార్పణ చేసిన ఘనత ఆయనదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో పేదలకు పలు సంక్షేమఫలాలు దక్కాయని పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్‌కు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభిమానులున్నారని అన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేపడతానని తెలిపారు. పార్టీని బలోపేతం చేసి విజయం సాధించేందుకు నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో సీఈసీ సభ్యు లు కొలిశెట్టి శివకుమార్, బి.జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ కన్వీనర్లు ఆదం విజయ్‌కుమార్, ఈసీ శేఖర్‌గౌడ్, యువజన, సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్లు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డిలతోపాటు జంపన ప్రతాప్, అమీర్‌అలీఖాన్, పి.విజయారెడ్డి, కాలేరు వెంకటేష్, వెల్లాల రాంమోహన్, శీలం ప్రభాకర్, బాల్‌రెడ్డి, మతీన్, సాజిద్ అలీ, లింగాల హరిగౌడ్, సాయినాథ్‌రెడ్డి, వెంకట్రావు, సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, ఓ.శ్రీనివాస్‌యాదవ్, పోచంపల్లి కొండల్‌రెడ్డి, సమన్వయకర్తలు సంజీవరావు, కొలను శ్రీనివాస్‌రెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రూపానందరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.